Taara Taara Song :ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుండి ఒక్కొక్క అప్డేట్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్(Nidhi Agarwal)మధ్య సాగే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “తార తార నా కళ్ళు” అంటూ విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ లో నిధి తన అందాలతో మరోసారి ఆకట్టుకుంది. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా.. లిప్సిక, ఆదిత్య పాడారు. ఇక ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2021లో మొదలైన ఈ సినిమా అనూహ్యంగా క్రిష్ తప్పుకోవడంతో రంగంలోకి జ్యోతి కృష్ణ వచ్చారు. అయితే కరోనా కారణంగా, లాక్ డౌన్ వల్ల కొద్దిరోజుల సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల మళ్ళీ ఈ సినిమా ఆగిపోయింది. ఇలా పలు కారణాలవల్ల షూటింగ్ ఆగిపోతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు జూన్ 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బాబీ డియోల్, సత్యరాజ్, జిసు సేన్ గుప్తా తదితరులు కీలకపాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత ఏ.ఎమ్.రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను విడుదలకు ఉంచి, మరొకవైపు సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (OG) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Hareesh Shankar)దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు పార్టు 2 తెరకెక్కిస్తారా లేక రాజకీయ పదవి కోసం గ్యాప్ ఇస్తారా అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.