Tamannaah Bhatia: ఇండస్ట్రీలో మహిళలపై జరిగే అన్యాయాల గురించి నటీమణులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ చాలావరకు మహిళలు వాటి గురించి బయటికి మాట్లాడి అనవసరంగా ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకని ఫీలవుతుంటారు. అందుకే కొందరు మాత్రం వీటి గురించి ఓపెన్‌గా మాట్లాడగలుగుతారు. తాజాగా తమన్నా కూడా ఇండస్ట్రీలో మహిళల గురించి మాత్రమే కాదు.. ప్రతీ రంగంలో మహిళలు అనేవారు ఎలా ఉండాలి అనే విషయంపై సలహా ఇచ్చింది. ప్రస్తుతం ‘సికిందర్ కా ముకద్దర్’ (Sikandar Ka Muqaddar) అనే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తమన్నా (Tamannaah Bhatia).. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.
తేడాలు ఉండకూడదు
సినీ పరిశ్రమలో మార్పులు తీసుకురావడంపై తమన్నా తమ అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘‘మనం ఆడ, మగ అని భేదాలతో మాట్లాడడం ఆపేస్తే బాగుంటుంది. మనం మనల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి. కానీ ఇలాంటి ఒక తేడా అన్నది మనలో ఉండిపోయింది. అందుకే ఇప్పుడు ప్రతీ రంగంలో ఆ తేడా కనిపించేలా చూస్తున్నాం. కానీ అలా జరగకూడదు. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామన్నదే ముఖ్యం. మనల్ని మనం సమానులుగా చూడకపోతే వేరేవాళ్లు కూడా అలా చూడరు’’ అని చెప్పుకొచ్చింది తమన్నా. ఇదే విషయాన్ని ఇంతకు ముందు పలువురు నటీమణులు చెప్పి.. తమకు కూడా సమానంగా రెమ్యునరేషన్ కావాలని అడిగారు.
Also Read: ఈ మోసగాడి జాబితాలో సమంత, కీర్తి సురేష్ కూడా.. అసలేం జరిగిందంటే..?
ఈగో వద్దు
‘‘నన్ను నేనే ఎన్నో పనులు చేయగలిగే మనిషిలాగానే చూస్తాను. ముందుగా ఏదైనా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మార్పులు తీసుకురావాలంటే ముందుగా ఆ ఇండస్ట్రీలోకి వెళ్లాలి. అందులో ఉంటేనే ఏం చేయాలో తెలుస్తుంది. నాకు తెలిసిన చాలామంది ఇండస్ట్రీలో ఒక్క రాత్రిలోనే ఎన్నో మార్పులు తీసుకురావాలని అనుకుంటారు. దూరం నుండి చూసి వాళ్లు ఇండస్ట్రీని మారిస్తే బాగుంటుంది అని చెప్పడం చాలా సులువు. కానీ అందులో భాగం కాకుండా ఎలా మారుస్తారు? మీరు నిజంగా అందులో భాగమయితేనే మార్పు తీసుకురాగలరు. ఈ ఇండస్ట్రీలో అందరూ కలిసి పనిచేయాలి కాబట్టి ఈగోను పక్కన పెట్టేయాలి. ఇది ఒక్కరు చేసే పని కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
బాధపడుతూ కూర్చోను
‘‘ఇండస్ట్రీలో ఉన్న మరొక విషయం ఏంటంటే.. మహిళలకు కావాల్సిన విషయాన్ని గట్టిగా అడగలేమని అనుకుంటారు. అలా అడిగితే వారిని పనిలో నుండి తీసేస్తారని భయపడతారు. ఇలా ఆలోచించాలని వారి బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. అందుకే ముందు ఈ ఆలోచనలు మారాలి. దాంతో పాటు ప్రొడక్టివ్‌గా ఉండాలి. మీకు మీరు చేయాల్సిన పని తెలిస్తే చాలు.. నేనెప్పుడూ బాధపడుతూ కూర్చునే టైప్ కాదు. నా గురించి నేనెప్పుడూ బాధపడను. అలా చేయడం స్టుపిడ్ అనుకుంటాను. నా పని నేను చేసుకుంటాను, సాధిస్తాను, జనాలకు నేనేం చేయగలనో చూపిస్తాను. అప్పుడే మార్పు అనేది మొదలవుతుంది’’ అని అందరికీ సలహా ఇచ్చింది తమన్నా. దీంతో తమన్నా చాలా బాగా చెప్పిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.