Telugu Movies In Pahalgam: మినీ స్విట్జర్ల్యాండ్ గా పేరుపొందిన పహల్గామ్ (Pahalgam) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా అక్కడి ప్రకృతి అందాలకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే తమ బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికిందంటే చాలు కుటుంబంతో కలిసి ఇక్కడ వాలిపోతూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఒక కొండ ప్రాంతం. ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన జమ్ము కాశ్మీర్ కి వచ్చే టూరిస్ట్ లలో ఎక్కువగా సందర్శించే ప్రాంతాలలో ఇదీ ఒకటి. లోతైన లోయలు, సరస్సులతో , పచ్చిక బయళ్ళతో చాలా అందంగా ముస్తాబై ఉంటుంది. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దేశ విదేశాలకు చెందిన టూరిస్ట్ లు కూడా పెద్ద సంఖ్యలో ఈ పహల్గామ్ వస్తూ ఉంటారు.
ఉగ్రవాద దాడితో రక్తమయంగా మారిన పహల్గామ్..
అయితే ఇలాంటి అందమైన, సుందరమైన ప్రదేశాన్ని కొంతమంది ఉగ్రవాదులు రక్తమయంగా మార్చేశారు. ఇక్కడ అడుగు పెట్టాలంటేనే వణికిపోయేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమంది హనీమూన్ కోసం పహల్గామ్ రాగా మరికొంతమంది కుటుంబంతో కాలక్షేపం చేయడానికి వచ్చారు. అయితే టూరిస్ట్ లను టార్గెట్ గా చేసుకున్న ఉగ్రవాదులు.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బైసరన్ కొండల నుంచి వచ్చి.. నువ్వు హిందువా..? ముస్లిమా ..? అంటూ అడిగి మరీ ప్రాణాలు తీయడం అమానవీయం అనే చెప్పాలి. దాదాపు 28 మంది అమాయకపు టూరిస్టులను ఈ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇక దీంతో దేశ విదేశాలు సైతం ఈ ఘటనను చింతిస్తూ ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలని ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది.
పహల్గామ్ లో నిర్మించిన తెలుగు చిత్రాలు ఇవే..
ఇదిలా ఉండగా ఒకప్పుడు ఈ పహల్గామ్ తెలుగు బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఇంతటి సుందరమైన ప్రదేశంలో నిర్మించిన ఆ తెలుగు చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..అల్లు అర్జున్ (Allu Arjun) ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ‘ సినిమా షూటింగు ఇక్కడే జరిగింది. అలాగే ప్రముఖ నటుడు శ్రీకాంత్(Srikanth ) కుమారుడు రోషన్ (Roshan)హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీ లీలా (SreeLeela) తొలి పరిచయంలో వచ్చిన ‘పెళ్ళి సందD’ సినిమా షూటింగు ఇక్కడే జరిగింది. అంతేకాదు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి’ సినిమా షూటింగ్ కూడా దాదాపు ఇక్కడే జరిగింది. ఇక్కడి ప్రకృతి అందాలను మనకు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అంతేకాదు మూడు నెలల క్రితం కూడా ‘హిట్ 3’ సినిమా షూటింగు 20 రోజులపాటు 200 మంది టీం తో కలిసి షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ.. “మూడు నెలల క్రితం షూటింగ్ కోసం ఇక్కడే ఉన్నాము. కానీ ఇంతలోనే ఇంత పెద్ద దాడి జరగడం చూసి హృదయం బద్దలైంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకవైపు విజయ్ దేవరకొండ కూడా..” సరిగ్గా రెండేళ్ల క్రితం ఇక్కడే స్వచ్ఛమైన మనుషుల మధ్య నా పుట్టినరోజును జరుపుకున్నాను. కానీ ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం” అంటూ తెలిపారు.
ALSO READ:Shobha Shetty: ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన శోభా శెట్టి.. ప్రత్యేకత తెలిస్తే షాక్..!