Chatrapathi Sekhar: తెలుగు సీరియల్స్ చూడని ఇల్లు మన తెలుగు రాష్ట్రాలలో ఉంటుందా చెప్పండి. మధ్యాహ్నం నుండి మొదలైతే కొన్ని గృహాలలో సీరియల్స్ కు విరామం ఉండదు. అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సీరియల్స్ కు సంబంధించి తాజాగా ఓ సినీ, సీరియల్ నటుడు సంచలన కామెంట్స్ చేశారు. పేరుకే తెలుగులో సీరియల్స్ అని, కానీ పెత్తనం మొత్తం పరభాష నటులదేనంటూ పేర్కొన్న ఆ నటుడు, అంతటితో ఆగక తెలుగు సీరియల్స్ లో జరుగుతున్న అసలు కథను బహిర్గతం చేశారు. ఆయన ఎవరో కాదు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి, ఎన్నో సినిమాలలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొని, ప్రస్తుతం సీరియల్స్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్న నటుడు చంద్రశేఖర్.
నటుడు చంద్రశేఖర్ అలియాస్ ఛత్రపతి శేఖర్ ప్రస్తుతం సినిమాలతో పాటు, సీరియల్స్ లలో కూడా నటిస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా, ప్రేక్షకులను మెప్పించడంలో ది బెస్ట్ యాక్టర్ అని చెప్పవచ్చు. చాలా వరకు సీరియల్స్ నుండి సినిమా వైపు అడుగులు వేసిన నటులు ఉంటే, ఈయన మాత్రం ఓ వైపు సినిమా, మరోవైపు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ తాజాగా తెలుగు నటులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు.
అసలేం చెప్పారంటే..
ఇటీవల పేరుకే తెలుగు సీరియల్స్ అయినప్పటికీ, ఎక్కువగా బెంగుళూరు, చెన్నై నగరాలకు చెందిన నటులకే ఛాన్సులు వస్తున్నాయన్న అపవాదు తెలుగు సీరియల్ పరిశ్రమకు ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని యాంకర్ అడిగిన ప్రశ్నకు చంద్రశేఖర్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీవీ సీరియల్స్ లలో ఎక్కువగా కన్నడ, తమిళ నటులకు మన పరిశ్రమ ఎక్కువగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. కానీ తెలుగు నటులకు మాత్రం అక్కడి సీరియల్స్ లలో ఒక్క అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.
ప్రతి తెలుగు సీరియల్ లో కన్నడ, తమిళ నటులు తప్పక ఉండే పరిస్థితి ఉందన్నారు. కొన్ని సీరియల్స్ రీమేక్ చేయడం వల్లనో ఏమో కానీ, తెలుగు నటులకు అవకాశాలు రాకుండా జారిపోతున్నాయన్నారు. తెలుగు టీవీ రంగంలో కూడా ఎందరో కష్టపడే నటులు ఉన్నప్పటికీ, మరి వారికి ఎందుకు అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. అవకాశాలు ఇచ్చే ఉద్దేశం లేక తెలుగు నటులకు ఎన్నో అపవాదులు వేయడం కొందరికి అలవాటుగా మారిందని, ఆ పరిస్థితి టీవీ సీరియల్ రంగంలో ఉందన్నారు.
పేమెంట్ కూడా తక్కువే..
తెలుగు నటులకు డబ్బులు చెల్లించడంలో బేరసారాలు ఆడే పరిస్థితి ఉందని, అదే ఇతర భాషా నటులను తీసుకువచ్చి, వారికి సపర్యలు చేస్తూ డిమాండ్ కు తగినట్లుగా డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. అదే తెలుగు నటుడు తన బండి మీద తాను షూటింగ్ కు వచ్చినా, దూరపు కొండలు నునుపు అన్నట్లుగా కన్నడ, తమిళ నటులకు టీవీ సీరియల్స్ వరంగా మారాయని విమర్శించారు. ఇతర నటులకు బడ్జెట్ కేటాయించడంలో మాత్రం నిర్మాతలు వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నారని, అదేదో తెలుగు నటులను ఆదరించడంలో ఆ అభిమానం ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.
తెలుగు నటులు మరీ లోకువ..
సీరియల్ షూటింగ్ సమయంలో తెలుగు నటులకు ఇచ్చే మర్యాద ఒకలా, అదే వేరే నటులకు ఇచ్చే మర్యాద ఆకాశానికి ఎత్తే విధంగా ఉంటుందన్నారు. తెలుగు భాషతో పుట్టిన తెలుగు నటులకు సీరియల్స్ లలో ఆదరణ కోల్పోయే పరిస్థితి వచ్చిందని, అదే పరాయి భాషలలో ఏ తెలుగు నటుడు నటిస్తున్నాడో చెప్పాలన్నారు. ఇతర భాషల నటుల ముందు తెలుగు నటులకు విలువ లేని పరిస్థితి ఉందని, మేము తోపు నటులం అనే స్థాయి వారిలో కనిపిస్తుందన్నారు.
Also Read: Horsley Hills: ఏపీలో వింత ప్రదేశం.. ఇదొక మాయా ప్రపంచమే.. చూసి తీరాల్సిందే!
ఇతర రాష్ట్రాల నటులను ఆదరించేదానికి తాను వ్యతిరేకం కాదని, కానీ తెలుగు నటులకు మాతృభాష సీరియల్ రంగంలో అవకాశాలు తక్కువ కావడమే తన ఆవేదనగా చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి టీవీ సీరియల్స్ రంగంలో కూడా తెలుగు నటులకు అంతంత మాత్రమే ఆదరణ ఉందన్న విషయం తేటతెల్లమైంది. నిర్మాతలూ.. జర ఇతర రాష్ట్రాల నటులను ఆదరించండి.. కాస్త తెలుగు నటులను గౌరవించండి, అవకాశాలు కల్పించండి అంటూ చివరగా చంద్రశేఖర్ కోరారు. మరి ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారగా, టీవీ సీరియల్ లోకం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.