RRR : ఆస్కార్ వేదికపై ‘నాటునాటు’ సాంగ్ దుమ్మురేపింది. హాలీవుడ్ పాటలను వెనక్కినెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. పురస్కారం అందుకున్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందన్నారు. గీత రచయిత చంద్రబోస్ ‘అందరికీ నమస్తే’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి బృందాన్ని కొనియాడుతున్నారు.
మోదీ అభినందనలు..
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ‘నాటు నాటు’ పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైందన్నారు. చరిత్రలో మరుపురాని పాటగా నిలిచిపోతుందని కితాబిచ్చారు. కీరవాణి, చంద్రబోస్‌లతోపాటు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందాన్ని మోదీ అభినందించారు.
తమిళిసై ప్రశంసలు..
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేశారని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆర్ఆర్ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పారు.
తెలుగువారికి గర్వకారణం : కేసీఆర్
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందన్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. నాటు నాటు.. పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని.. తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పాట ద్వారా తెలుగులోని మట్టి వాసనలను గీత రచయిత చంద్రబోస్ వెలుగులోకి తీసుకొచ్చారని అన్నారు.
గర్వించేలా చేశారు : చిరంజీవి
‘ఆర్ఆర్‌ఆర్’ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపారు. రామ్ చరణ్ ఈ మూవీలో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘ఆర్ఆర్‌ఆర్’ మూవీని ఆస్కార్‌కు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలన్నారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. రాజమౌళిని కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
చారిత్రక ఘట్టం : నాగార్జున
‘నాటు నాటు’సాంగ్‌కు ఆస్కార్ రావడంపై హీరో నాగార్జున ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు ఇదొక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారని కొనియాడారు.
మరోస్థాయికి భారతీయ సినిమా : పవన్‌కల్యాణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. ట్విటర్ లో శుభాకాంక్షలు తెలిపారు.‘ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన ‘RRR’లోని ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు’’ అని పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
సంబరాలే..సంబరాలు : కేటీఆర్
‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ రావడంపై మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కోట్లాది భారతీయుల సంబరాల్లో తానూ చేరానని అన్నారు. ‘ఆర్ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి ట్విటర్ లో అభినందనలు తెలిపారు. ‘ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. ఈ గొప్ప క్షణానికి కారకుడు, అద్భుతమైన కథకుడు రాజమౌళి భారతదేశాన్ని గర్వపడేలా చేశారు. రామ్‌చరణ్, తారక్ తమ డ్యాన్స్‌తో రంజింపజేశారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.