Trance of kuberaa : శేఖర్ కమ్ముల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులుది ఒక తీరు, శేఖర్ కమ్ములది మాత్రం ఒక తీరు. తన రూటే సపరేటు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే ఆ సినిమాకి అవార్డులు వచ్చాయి గాని కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా ఆనంద్. ఈ మంచి కాఫీలాంటి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు లైబ్రరీలో కూర్చొని ఒక అద్భుతమైన పుస్తకాన్ని చదివిన అనుభూతిలా అనిపిస్తుంది. చివరగా లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ అందుకున్న శేఖర్ ప్రస్తుతం ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కుబేర అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
కుబేర టీజర్ టాక్
ఇక ఈ టీజర్ విషయానికి వస్తే నాది నాది అని ఒక సాంగ్ తో స్టార్ట్ అయి చివరి వరకు కూడా అదే సాంగ్ తో ఆసక్తికరంగా టీజర్ ఉండేలా ప్లాన్ చేశాడు శేఖర్. అయితే కేవలం ధనుష్ ను మాత్రమే కాకుండా నాగర్జున ను కూడా అదే స్థాయిలో చూపించారు. విలన్ తో మొదలైన ఈ టీజర్ తర్వాత బిజినెస్ పర్సన్ గా నాగర్జునని చూపించారు. ఆ తర్వాత రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడుకొని ధనుష్ ను చూపించారు. ఆ తర్వాత తనను కూడా బిజినెస్ మెన్ గా చూపించారు. అలానే నాగర్జున కి, ధనుష్ కి మధ్య జరిగే ఒక ఆసక్తికర సన్నివేశంతో ఈ టీజర్ ఫినిష్ చేశారు. ముఖ్యంగా ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమాకి కుబేర అనే టైటిల్ ఎందుకు పెట్టారు అర్థం అవుతుంది.
ఆసక్తికర టైటిల్
రిలీజ్ చేసిన పోస్టర్ లో కుబేర అనే టైటిల్ పెట్టి ధనుష్ ని ఒక బెగ్గర్ లుక్ లో చూపించారు. కుబేర అంటే ధనాధిదేవత. శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం. అటువంటి టైటిల్ ను సినిమాకి పెట్టి ధనుష్ ని కంప్లీట్ వేరే లుక్ లో చూపించడం అనేది కొద్దిపాటి ఆసక్తిని రేకిస్తుంది. ఇక ధనుష్ వెనకాల అన్నపూర్ణ మాత శివునికి ధాన్యాన్ని దానం చేసినట్లు చూపించడం కూడా ఒక క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు ఒకవైపు ధనవంతుడుగాను మరోవైపు బిచ్చగాడిగాను చూపిస్తూ ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచేలా చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.