Producers Meet :గత కొన్ని రోజులుగా సినిమాలలో సరైన కంటెంట్ లేకపోవడం, పెరిగిన టికెట్ ధరలు, ఇతర కారణాలవల్ల ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే థియేటర్ యాజమాన్యం పూర్తిగా నష్టపోతోంది. అందుకే థియేటర్ అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉండడంతో ఎగ్జిబిటర్లు అందరూ జూన్ 1 నుండి సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్మాతలకు లేఖ రాయబోతున్నారంటూ ఒక వార్త తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఈరోజు ఉదయం 11:00 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరవడం జరిగింది.
ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమావేశం..
అయితే ఇదే రోజు సాయంత్రం 4:00 గంటలకు తెలుగు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు.. థియేటర్లు రన్ చేస్తూనే సమస్యను పరిష్కరించుకునే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేసినా.. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కారణంగా షూటింగ్ నిలిపివేసినా.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో.. ఈసారి థియేటర్లు మూతపడకుండా సినిమాలు రన్ చేస్తూనే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు. దీనికి తోడు పైరసీ, ఐపిఎల్ , ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. పైగా మే 30 నుంచి వరుస సినిమాలు.. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో ఇప్పుడు థియేటర్లు మోసేస్తే అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు మరింత ఇబ్బంది అవుతుంది. కాబట్టి థియేటర్లు మూసివేయాలి అనే ఆలోచనను ప్రస్తుతం వేయాల్సిందిగా నిర్మాతలు కోరారు.తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలియజేశారు.
అసంతృప్తిగా ముగిసిన మీటింగ్.. కోపంతో తలుపు తన్నిన సురేష్ బాబు..
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమావేశం అసంపూర్ణంగానే ముగిసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. షేరింగ్ బేస్ లో ఇవ్వడం నిర్మాతలకు ఇష్టం లేదట. డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్స్ ముందు పెట్టడంతో కోపంతో నిర్మాతలు ఊగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తలుపులు తన్నుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. మరి దీనిపై మిగతా నిర్మాతల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.