OTT Movie : ప్రేమంటే ఎంత సంతోషం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది. మామూలుగా అయితే ప్రేమించిన వారు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే కొన్నాళ్ళకు ఆ బాధ నుంచి కోలుకుని మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటారు. కానీ లైఫ్ లో ప్రేమించిన వాడల్లా చనిపోతే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఈరోజు మన మూవీ సజెషన్.
స్టోరీలోకి వెళితే
పార్క్ మి-జియోంగ్ అందమైన అమ్మాయి. అందం, అట్రాక్షన్ కారణంగా అందరూ ఆ అమ్మాయిని మంత్రగత్తె (Witch) అని పిలుస్తారు. హైస్కూల్ రోజుల నుంచి మొదలు పెడితే… ఆమెను ఇష్టపడిన అబ్బాయిలు లేదా ఆమెతో సన్నిహితంగా ఉన్న వారు వరుసగా అనుకోని ప్రమాదాల్లో మరణించడం లేదా గాయపడడం వల్ల ఆమెపై ఒక శాపం ఉందనే పుకారు పుట్టుకొస్తుంది. ఈ సంఘటనల కారణంగా ఆ అమ్మాయిని తన గ్రామం నుండి బ్యాన్ చేస్తారు. దీంతో ఆ పిల్ల సమాజానికి దూరంగా, ఒంటరిగా జీవిస్తుంది. తన జీవితంలో జరిగిన దురదృష్టకర సంఘటనలకు తానే కారణమని నమ్మి, ఒంటరితనంతో బాధపడుతుంది. ఇంగ్షీషులో నైపుణ్యం కలిగిన ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తూ, ఆమె గతం నీడలో జీవిస్తుంది.
మరోవైపు లీ డాంగ్-జిన్ ఒక ట్యాలెంటెడ్ డేటా అనలిస్ట్. స్టాటిస్టిక్స్‌లో నైపుణ్యం కలిగిన, సైన్స్ అండ్ లాజిక్‌ను నమ్మే వ్యక్తి. అతను మి-జియోంగ్ తో పాటు హైస్కూల్ లో చదివాడు. అలాగే ఆమె అంటే అప్పట్లోనే క్రష్ ఉండేది. అయితే దశాబ్దం తర్వాత, వీళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా మళ్లీ కలుస్తారు. డాంగ్-జిన్ ఆమెపై ఉన్న శాపం రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అవుతాడు. హీరోయిన్ ను సమాజంలోకి తిరిగి తీసుకురావడానికి తన స్టాటిస్టికల్ నైపుణ్యాలను ఉపయోగించి, ఆమె చుట్టూ జరిగిన దుర్ఘటనలను విశ్లేషిస్తాడు. అయితే ఈ ప్రక్రియలో అతను తన స్వంత జీవితాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే మి-జియోంగ్‌కు దగ్గరవ్వడం ప్రమాదకరమని అందరూ నమ్ముతారు. ఈ క్రమంలో హీరోకి హీరోయిన్ గతం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి. ముఖ్యంగా జంగ్-హ్యోక్ అనే మరో వ్యక్తి కూడా మి-జియోంగ్ లాంటి ఒక రహస్యాన్ని కలిగి ఉంటాడనే విషయం వెల్లడవుతుంది. ఇంతకీ ఆ రహస్యం ఏంటి? హీరో హీరోయిన్ శాపాన్ని తొలగించగలిగాడా? చివరగా వచ్చే ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ‘ది విచ్’ (The Witch) అనే కొరియన్ సిరీస్ గురించి. 2025 లో వచ్చిన ఈ కొరియన్ డ్రామా కాంగ్ ఫుల్ రాసిన వెబ్‌టూన్ ‘మాన్యో’ (Manyeo) ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్‌లో పార్క్ జిన్-యంగ్, రో జియోంగ్-యుయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ 60 నిమిషాల దాకా ఉంటుంది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉన్న నయనతార సైకో కిల్లర్ మూవీ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా?