Allu Arjun :దేశ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప -2. ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా వేల రూపాయలను ఖర్చుపెట్టి మరీ తమ అభిమాన హీరో సినిమాని మొదటి రోజు మొదటి షో చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కూడా నేరుగా అభిమానులతో కలిసి కూర్చొని సినిమా చూడాలనుకున్నారు. అంతేకాదు థియేటర్లలో అభిమానులు చేసే హడావిడిని నేరుగా చూడాలనుకున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ కి అర్ధరాత్రి తరలివచ్చారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ కారణంగా మహిళ మృతి..
సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకముందు వరకు వాతావరణం ప్రశాంతంగానే సాగింది. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ థియేటర్లోకి అడుగు పెట్టారో ఇక ఆడియన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను చూడడానికి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో సినిమా చూడడానికి వచ్చిన బన్నీ అభిమానురాలు 39 సంవత్సరాల వయసున్న రేవతి అక్కడికక్కడే మృతిచెందగా , ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. బాలుడికి ప్రథమ చికిత్స అందించి వెంటనే హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ కి ఆ సమయంలో వచ్చి సినిమా చూడాల్సిన అవసరం ఏముందని మండి పడుతున్నారు.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయాలని డిమాండ్..
అంతేకాదు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో భాగంగా రేవతి మరణించడంతో అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయనను అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరారు.
పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు.. మరి బన్నీ సంగతేంటి..?
అయితే ఈ విషయం ఇలా జరగడంతో ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. గతంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కామన్ మ్యాన్ క్యాటగిరి లో అడుగు పెట్టారు పల్లవి ప్రశాంత్. తన ఆట తీరుతో అందరిని మెప్పించారు. అయితే హౌస్ లో తోటి కంటెస్టెంట్ అయిన అమర్దీప్ తో జరిగిన విభేదాలు పలు చర్చలకు దారి తీశాయి. అంతటితో ఆగకుండా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు అక్కడ ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు చెప్పినా సరే పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు ఆయన అభిమానులు ప్రభుత్వ బస్సులను రాళ్లతో పగలగొట్టి ధ్వంసం చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ అభిమానులు బస్సు అద్దాలు పగలగొడితే , ఆయనపై కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి షో చూసి, ఒక మనిషి మరణానికి కారణమైనందుకు మరి అరెస్ట్ చేస్తారా? జైలులో పెడతారా? పోలీస్ కమిషనర్ గారూ అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై పోలీస్ కమిషనర్ ఎలాంటి స్పందిస్తారో చూడాలి.