Tollywood Industry : ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐక్యత బాగా పెరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పాలు పంచుకోవడానికి మిగతావారు ముందుకు వస్తున్నారు. అది ఆనందమైనా సరే అందరూ కలసి సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమా విజయం సాధిస్తే.. మిగిలిన వాళ్ళు కూడా సంబరపడిపోతున్నారు. ఇక పోటీ ప్రపంచంలో నడుస్తున్న సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటే, టాలీవుడ్ కి తిరుగే లేకుండా పోయింది. అయితే ఇది ఎల్లకాలం ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి. అయితే ఇది ఆనందాల వరకు ఓకే, కానీ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలు ఇచ్చినప్పుడైనా టాలీవుడ్ సంతోషపడాలి కదా.. కానీ గతంలో ఇలా జరిగింది.. అయితే ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందా అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాలకృష్ణకు భారత అత్యున్నత 3వ పౌరపురస్కారమైన ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. దాంతో సినీ పెద్దలంతా కలిసి బాలయ్యకు సన్మాన సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో అసలు చిక్కు తెరపైకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. 2006లో చిరంజీవి (Chiranjeevi) కి ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఇక 2024లో భారత ప్రభుత్వ రెండవ అత్యంత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ కూడా లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. అయితే ఈ ఆనందాన్ని టాలీవుడ్ మాత్రం పంచుకోలేదు కేవలం సోషల్ మీడియాలో ట్వీట్ లు పెట్టి సరిపెట్టుకున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం చిరంజీవికి సన్మానం చేసి తెలుగు రాష్ట్రాల ఘనత ఇది అంటూ తెలిపింది. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. భారీ స్థాయిలో సభ పెట్టి చిరంజీవిని ఘనంగా సత్కరించి, పండుగ చేసుకుందాం అంటూ కొంతమంది సినీ పెద్దలు చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు.
ఇక ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఏం చేస్తారు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బాలయ్యకు ఈ పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఆయనకు సన్మాన సత్కారాలు చేస్తోంది అనడంలో సందేహం లేదు. మరి టాలీవుడ్ ఈ విషయంలో ముందుకు వస్తుందా? ఒకవేళ ఇదే జరిగితే అప్పుడు చిరంజీవికి ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.
ఒకవేళ బాలకృష్ణకు సన్మాన సభ చేయకపోతే గతంలో చిరంజీవికి చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా బాలయ్యకు చేయలేదు. మొత్తానికి పెద్ద హీరోలను సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు.. అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. అయితే గతంలో చిరంజీవికి ప్రముఖ నిర్మాత టీ.జీ.విశ్వప్రసాద్ (T.G.Viswaprasad) మాత్రమే విదేశాలలో సన్మానం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలయ్యకు సన్మాన సభ చేస్తారా? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది? ఇక బాలయ్యకు సన్మానం చేసినా? చెయ్యకపోయినా..? ఎటొచ్చినా తలనొప్పిగానే మారింది అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.