Anil ravipudi: అనిల్ రావిపూడి(Anil ravipudi).. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్ (Venkatesh)తో ఎఫ్2, ఎఫ్3, సినిమాలు చేసి తన ఖాతాలో మంచి విజయాలను వేసుకున్న ఈయన.. ముచ్చటగా మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది ఈ సినిమా. దీన్ని బట్టి చూస్తే ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ సినిమా ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా విడుదలయ్యింది. ఇక ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు.
ఓటమి ఎరుగని డైరెక్టర్ గా గుర్తింపు..
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా పాన్ ఇండియా సినిమాల వైపు పరిగెడుతుంటే.. ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం ఆ సినిమాల జోలికి వెళ్లకుండా తాను నమ్ముకున్న కథతో లోకల్ గానే ఒక రేంజ్ లో హిట్స్ అందుకుంటున్నారు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా సినిమాలు తీస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్న అనిల్ రావిపూడి, అసిస్టెంట్ డైరెక్టర్ నుండి దర్శకుడిగా మారి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మొదట కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన ‘పటాస్’ సినిమాతో డైరెక్టర్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విడుదలై ఇటీవలే పదేళ్లు కూడా పూర్తిచేసుకుంది.ఈ పదేళ్లలో ఫ్లాప్ అంటూ ఎరుగని డైరెక్టర్గా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2 , ఎఫ్3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా ప్రతి సినిమా కోసం ఒక స్టార్ హీరోని ఎంచుకొని, ఆ స్టార్ హీరోలకు మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
అతడే నా బెస్ట్ ఫ్రెండ్..
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ సప్తగిరి(Sapthagiri ). అంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నా సినిమాలో ఆయనకు చాన్స్ ఇవ్వలేదు. దీనికి కారణం కూడా చెబుతాను అంటూ.. సప్తగిరి ఫోన్ చేసి నా సినిమాలో ఒక్క సీన్ లేదా రెండు సీన్లు చెయ్యమని అడిగితే.. అలా చేయను అని అంటాడు. సరే రా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ నీకు తగ్గట్టు దొరికితే చేద్దాంలే అని నేను అన్నాను. అయితే ఇప్పటివరకు అది కుదరలేదు. అదే వాడు ఒకటి రెండు సీన్ అయినా పర్లేదు అంటే వాడి కోసం ఒక మంచి కామెడీ సీన్స్ చేసే వాడిని” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. అలాగే సప్తగిరి, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ తన స్నేహితుడు సప్తగిరి గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.