Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆ తరువాత కథకు తగ్గట్టు తనను తాను మలుచుకుంటూ న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. అయితే తాను పడిన కష్టం ఇండస్ట్రీలో మరెవ్వరు పడకూడదని మొదటినుంచి కొత్త డైరెక్టర్స్ ను పరిచయం చేస్తూ వస్తున్నాడు.
టాలెంట్ ఎక్కడ కనిపించినా కూడా నాని అస్సలు వదలడు. ఏ సినిమా అయినా సరే తనకు నచ్చింది అంటే నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని అందరి ముందు చెప్పడానికి వెనుకాడని హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటాడు. అది ఏ భాషలోని సినిమా అయినా సరే.. చిన్నదా..? పెద్దదా..?. సీనియర్ హీరోనా..? కుర్ర హీరోనా ..? అనే విషయాలను పక్కన పెట్టి అందులో ఉన్న కథను బట్టి నాని వారిపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు. ఒక సినిమా నచ్చింది అంటే సోషల్ మీడియాలో ఎవరు ఏమనుకున్నా సరే నచ్చింది అనే చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకా బాగా నచ్చితే డైరెక్ట్ గా వారిని కలిసి శుభాకాంక్షలు చెప్తాడు.
తాజాగా కోలీవుడ్ సెన్సేషన్ గా మారిన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ ను నాని కలిసి ప్రశంసించాడు. శశి కుమార్, సిమ్రాన్ జంటగా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్ద సినిమాలుగా వచ్చిన హిట్ 3, రెట్రో సినిమాలను కూడా పక్కకు నెట్టేసి రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఇక తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీను వీక్షించిన నాని డైరెక్ట్ గా డైరెక్టర్ అభిషన్ జీవింత్ ను కలిసి ప్రశంసించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అభిషన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
“ఎంతటి అద్భుతమైన రోజు. నాని సర్ మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. కింద నుంచి పైకి వచ్చినవారు. మీరు నా సినిమా గురించి ఇంత వివరంగా చెప్పిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా అది నాకు చాలా ప్రత్యేకమైనదిగా మారింది. మీకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త తెలియడంతో నాని ఫాన్స్ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఒక మంచి సినిమా ఎక్కడ ఉన్నా సరే నాని అస్సలు వదలడు అని, అతనికి సినిమా మీద అంత పిచ్చి ఉందని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే అన్ని కుదిరితే అభిషన్ జీవింత్ తో నాని సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే నాని కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. దసరా లాంటి హిట్ కాంబో తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ప్యారడైజ్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
What a day! Truly honoured to have met you, @NameisNani sir. You’re such a humble and grounded person. The way you spoke about the film in such detail made it more special for me. Thank you 🙂 pic.twitter.com/pKpHbeDycQ
— Abishan Jeevinth (@Abishanjeevinth) June 14, 2025