Trinayani Serial Actress Pavitra Jayaram Died in Road Accident: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి పవిత్ర జయరామ్ దుర్మరణం చెందింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె సొంతూరు కర్ణాటక కావడంతో రెండు రోజుల క్రితం ఊరు వెళ్లి నేడు తిరిగి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కారులో ఆమెతో పాటు ఆమె బంధువు ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్, డ్రైవర్ ఉన్నారని, వారు తీవ్ర గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. హైవే పైన కారు.. ఎదురుగా వస్తున్నా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇక పవిత్ర అక్కడికక్కడే మృతిచెందగా.. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇక పవిత్ర మరణంపై నటుడు చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యాడు.. ” పాప.. నీతో దిగిన లాస్ట్ పిక్ రా.. నువ్వు లేవన్న విషయాన్నీ నేను జీర్ణించుకోలేకపోతున్నా.. ఒక్కసారి మామ అని పిలువే .. ప్లీజ్. నా పవి ఇక లేదు ” అంటూ రాసుకొచ్చాడు.
పవిత్ర కన్నడ నటి.. అక్కడ రోబో ఫ్యామిలీ, జోకలి, నీలి, రాధారామన్ లాంటి సీరియల్స్ లో నటించి మెప్పించిన ఆమె తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తిలోత్తమ్మ అనే పాత్రలో ఆమె విలనిజం పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆమె మరణ వార్త విన్న పలువురు సీరియల్స్ ఆర్టిస్ట్స్ ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.