నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయ నేతగా చలామణి అవుతున్నారు రెండు రంగాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్న ఈయన.. ఇప్పుడు బుల్లితెరపై కూడా అడుగు పెట్టారు. అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాల్గవ సీజన్ మొదలైంది. మొదటి ఎపిసోడ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ముఖ్యఅతిథిగా విచ్చేయగా.. రెండవ ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్ (Dulquar salman) .. ‘లక్కీ భాస్కర్ ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విచ్చేశారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో సూర్య (Suriya ) ‘ కంగువ’ ప్రమోషన్స్ కి హాజరయ్యారు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘ పుష్ప -2 ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి విచ్చేశారు.
అన్‌స్టాపబుల్ లో ఐకాన్ స్టార్..
తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ని ఆహా విడుదల చేసింది. ఈ ప్రోమో లో అల్లు అర్జున్ తన జీవిత విశేషాలను బాలకృష్ణతో పంచుకున్నారు. ఇకపోతే ఈనెల 15వ తేదీన ఈ ఎపిసోడ్ రిలీజ్ కాబోతోంది. మరోవైపు బాలకృష్ణ, అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రోమోలో ఏముందంటే..?
ప్రోమో విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ అభిమానులలో కొత్త జోష్ నింపాయి. ఇక అల్లు అర్జున్ స్టేజ్ పైకి రాగానే బాలకృష్ణ..” మనిద్దరం రిలేటివ్స్ అన్న విషయం నీకు తెలుసా?” అని అడగ్గా .. దీంతో ” ఎలా సార్..?” అని బన్నీ అడగగా.. “నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడివి” అంటూ సమాధానం చెబుతాడు. ఇక తర్వాత అల్లు అర్జున్..” మీరు గీత ఇవ్వండి ..మేము కురుక్షేత్రం చేస్తాము” అంటూ కామెంట్లు చేసారు.
” నువ్వు నాకు పార్టీ ఇవ్వలేదేంటి..?”అని అడగ్గా..” మీకు ఖచ్చితంగా.. మీ మాన్సన్ లో ఒక హౌస్ పార్టీ ” అంటూ కామెంట్లు చేశారు బన్నీ.
“నేషనల్ అవార్డు రాగానే.. మీకు ఎలా అనిపించింది..?” అంటూ బాలకృష్ణ అడగగా.. “బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెక్ చేస్తే … ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. దీనిని రౌండ్ ఆఫ్ చేసి, ఇది నేను కొట్టాలి అనే సంకల్పంతోనే ట్రై చేశాను. అలా నేషనల్ అవార్డు వచ్చింది” అంటూ తెలిపారు అల్లు అర్జున్.
కొంతమంది స్టార్స్ ఫొటోస్ చూపిస్తాను.. అవి చూడగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పాలి అంటూ చెప్పి.. స్క్రీన్ పై చిరంజీవిని అల్లు అర్జున్ ముద్దు పెడుతున్న ఫోటోని చూపించారు బాలకృష్ణ. ఇక అల్లు అర్జున్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆకాశానికి ఎత్తేసారు. అయితే ఈ మాటలను ప్రోమోలో మ్యూట్ చేసినా.. ఆ తర్వాత ఆడియన్స్ చప్పట్లు , ఈలలతో హోరెత్తించారు. మొత్తానికైతే అల్లు – మెగా వివాదానికి కూడా అల్లు అర్జున్ పులిస్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత సెట్ పైకి అల్లు అర్జున్ తల్లిగారు కూడా వచ్చారు.