Varalakshmi Sarath Kumar:2023లో నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) కలసి నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు కూడా భారీ పాపులారిటీ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణకు చెల్లెలిగా, విలన్ గా జయమ్మ క్యారెక్టర్ లో ఒదిగిపోయి మరీ నటించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇదంతా ఇలా ఉండగా ఇటీవల 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన బాలకృష్ణకు భారత ప్రభుత్వ మూడవ అత్యంత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలాంటి సమయంలో తాజాగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ కీలక కామెంట్లు చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. “బాలయ్యతో నేను మాట్లాడాను. నా భర్త నిక్కు కూడా ఆయన రీసెంట్ పాటకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. ఇక ఆయన అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే బాలకృష్ణకు ఈ అవార్డు అందుకునే అర్హత ఉంది. ముఖ్యంగా ఆయన ఫిలిం కెరీర్ ను పక్కన పెడితే, ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన వాళ్లకు ఎంత చేశారో, నేను స్వయంగా చూశాను. సినిమా కెరియర్ అందరికీ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రమే కలిసి వస్తుంది. మరికొన్ని సమయాలలో అది బ్యాడ్ కూడా అవుతుంది. కానీ ఇంకో మనిషికి సహాయం చేయాలి అంటే కచ్చితంగా మనసు ఉండాలి. అది బాలకృష్ణకు ఉండడం వల్లే ఇంత మందికి మంచి జరుగుతోంది” అంటూ చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్.
బాలకృష్ణ సినిమాలు..
బాలకృష్ణ విషయానికి వస్తే.. తాజాగా ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరొకవైపు అఖండ -2 సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ సీక్వెల్ గా ఇది రాబోతోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వచ్చినా ఆమెను తీసేసి సంయుక్త మీనన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి బాలయ్య రెండవ కూతురు తేజస్వి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తూ ఉండగా సెప్టెంబర్ 25న ఈ ఏడాది దసరా సందర్భంగా థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం కాదు. ఈ సినిమా తర్వాత మళ్లీ బాబి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.