Kurnool Crime: కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పటి వరకు ఎరుగనిది.. జరగనిది. మరీ ఇంత దుర్మార్గంగా కూడ ఆలోచనలు వస్తాయా అనే ప్రశ్న రాకమానదు. ఔను.. ఓ విద్యార్థినికి ఉత్తమ మార్కులు వస్తున్నాయన్న అక్కసుతో కొందరు విద్యార్థులు చేసిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎక్కడైనా పోటీ పడి చదివి మంచి మార్కులు సాధించే తత్వం ఉండాలి కానీ, ఏకంగా ఆ విద్యార్థినిపై చేతబడి చేసేందుకు ప్రయత్నం చేయడం హైలెట్ గా నిలిచింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భాదిత విద్యార్థి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నగర శివారులో ఎస్.ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు విద్యాభోదన సాగిస్తున్నారు. అయితే ఈ కళాశాలలో సున్నిపెంటకు చెందిన బ్లెస్సీ చదువు కొనసాగిస్తోంది. బైపీసీ మొదటి సంవత్సరం చదువు కొనసాగిస్తున్న బ్లెస్సీకి చదువంటే ప్రాణం. అందుకే ఆలస్యంగా కళాశాలలో చేరినా, ఉత్తమ మార్కులు సాధిస్తోంది. ఈ దశలో ఆదివారం అర్ధరాత్రి బ్లెస్సీ నిద్రిస్తున్న క్రమంలో, గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించారు. జుట్టును కత్తిరించి, పదునైన కత్తితో చెయ్యిని కోయగానే బ్లెస్సీ నిద్ర లేచింది. గట్టిగా కేకలు వేయగానే ఆ వ్యక్తి పరారయ్యాడట.
అయితే బ్లెస్సీ ప్రక్కన నిమ్మకాయలు, జుట్టు, కిల్ యు అంటూ లెటర్ రాసి ఉండడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. అంతలోనే యాజమాన్యం దృష్టికి జరిగిన ఘటన వెళ్లింది. ఈ ఘటన గురించి బ్లెస్సీ తల్లిదండ్రులకు తెలియజేయలేదు. అప్పుడే వేరే విద్యార్థి ద్వార సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాలకు వచ్చి ఇదేంటని ప్రశ్నించడంతో తల్లిదండ్రులను కూడా నచ్చ చెప్పి సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడ జోక్యం చేసుకున్నాయి. వారు కూడ యాజమాన్యాన్ని ఇది ఏంటని ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా చెప్పకుండా యాజమాన్యం తప్పించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు కళాశాలలో ఆలస్యంగా అడ్మిషన్ తీసుకున్నా కూడ, మంచి మార్కులు రావడంతోనే క్షుద్ర పూజల యత్నానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యాజమాన్యం పై కఠినంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా ఎస్.ఆర్ కళాశాలలో విద్యార్థి సంఘాల నాయకులు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విద్యార్థి సంఘాలు మహిళా సంఘం కలిసి రోడ్డుమీద ధర్నా నిర్వహించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read: Sanal Kumar Sasidharan : హీరోయిన్ ను వదలని డైరెక్టర్… వేధింపులపై కేసు నమోదు… మళ్లీ అరెస్ట్ తప్పదా ?
మొత్తం మీద ఒక విద్యార్థిని గదిలోకి రావడం, జుట్టు కత్తిరించడం, అలాగే చేయి కోయడం చూస్తుంటే చేతబడి ప్రయోగం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని విద్యార్థిని బంధువులు తెలుపుతున్నారు. మరి ఈ ఘటన వెనుక అసలు కారణం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.