Big Stories

Varma New Movie : వర్మ పొలిటికల్ వ్యూహం.. రాజకీయ శపథమేనా?

Varma New Movie : ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తో భేటీ కావడంపై సర్వత్రా చర్చ మొదలైంది. 45 నిమిషాలపాటు వర్మతో జగన్ ఏం చర్చించారనే ఆసక్తి ప్రతి ఒక్కరూలోనూ నెలకొంది. ఈ విషయాన్ని వర్మ నుంచి రాబట్టేందుకు మీడియా ప్రతినిధులు చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వర్మ వెళ్లిపోయారు. కానీ వర్మ రూటే సెపరేటు కదా జగన్ భేటీ అయిన 24 గంటల్లోనే సంచలన ప్రకటన చేశారు. ఈసారి మరో పొలిటికల్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. తాను తీయబోయే పొలిటికల్ సినిమా వివరాలను ట్విట్టర్ లో వెల్లడించారు. అందులో ఏముండబోతోందో కూడా చెప్పేశారు. ఇది బయోపిక్ కాదని, అంతకన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో మాత్రం నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని వర్మ చేసిన ట్వీట్ ఉత్కంఠ మరింత పెంచేలా ఉన్నాయి.

- Advertisement -

చిత్ర కథకు సంబంధించిన వివరాలు కూడా వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి వ్యూహం కథ ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందన్నారు. రాచకురుపు మీద వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే వ్యూహం చిత్రమని రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఎన్నికల టార్గెట్ గా ఈ సినిమా తీయడం లేదని చెప్తే ఎవరూ నమ్మరు కనుక ఏం చెప్పాలో, చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనుక చెప్పట్లేదని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తీస్తున్నట్లు వెల్లడించారు. మొదటి భాగాన్ని వ్యూహం పేరుతో, రెండోభాగాన్ని శపథం పేరుతో విడుదల చేస్తామని వెల్లడించారు. రెండింటిలోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ప్రజలు మొదటి భాగం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపే పార్ట్ 2 శపథం వస్తుందన్నారు. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్ వ్యూహం చిత్రాన్ని నిర్మిస్తారని వర్మ తెలిపారు.

- Advertisement -

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల తర్వాత వర్మ మరోసారి టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేస్తూ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాపైనా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడినా వర్మ పట్టించుకోలేదు. ఇప్పుడు మరో పొలిటికల్ సినిమా అనౌన్స్ చేసి రాజకీయ రచ్చకు తెరలేపారు వర్మ. వ్యూహం సినిమా ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. మరి వెంటనే వర్మ ఏ విధంగా శపథం చేస్తారో కూడా చూడాలి.

తన పొలిటికల్ సినిమా వివరాలను ఆడియో రూపంలో రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఆ ఆడియో లింక్ కింద ఉంది . క్లిక్ చేసి వినండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News