Target Stephen : మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ తెలంగాణలో కాక రేపుతోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందనేది అధికార పార్టీ ఆరోపణ. ముగ్గురు మధ్యవర్తులను కమలదళం పంపించగా.. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వారి ఫిర్యాదుతో సీపీ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగి ఆ ముగ్గురు మధ్యవర్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిపై పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆ ఫామ్ హౌజ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిదే. పోలీసులకు ఫోన్ చేసింది కూడా ఆ ఎమ్మెల్యేలే. వెంటనే స్పాట్ కు చేరుకున్న సీపీ మీడియాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పదవులు, కాంట్రాక్టులు, డబ్బులతో తమను ప్రలోభపెడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే తాము రైడ్ చేశామని చెప్పారు. అప్పటికింకా విచారణ కూడా జరగలేదు. మొదట్లోనే పదవులు, కాంట్రాక్టులు, డబ్బులు.. అంటూ సీపీ స్టీఫెన్ ఓ వర్షన్ వినిపించడమేంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అని కమలనాథులంతా ముక్తకంఠంతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పనిలో పనిగా సీపీ స్టీఫెన్ రవీంద్రను సైతం టార్గెట్ చేస్తున్నారు.
సీపీ స్టీఫెన్ టీఆర్ఎస్ కు తొత్తుగా మారారని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు ఆరోపించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సైతం ఇలాంటి విమర్శలే చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, సీబీఐతో గానీ విచారణ చేయించాలనేది కిషన్ రెడ్డి డిమాండ్.
అధికార పార్టీ నేతలతో పాటు పోలీస్ అధికారులనూ టార్గెట్ చేయడం బీజేపీ గేమ్ ప్లాన్ అంటున్నారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ అప్పటి సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ పై ఇలానే విరుచుకుపడ్డారు కమలనాథులు. పోలీస్ రైడ్ లో దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడగా.. ఆ డబ్బులు పోలీసులే పెట్టారంటూ రివర్స్ అటాక్ చేశారు బీజేపీ శ్రేణులు. ఆ క్రమంలో సీపీ జోయల్ డేవిస్ పై పదే పదే మాటల దాడి చేశారు. అప్పట్లో బీజేపీకి ఆ స్ట్రాటజీ బాగానే వర్కవుట్ అవడంతో.. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్ లోనూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను అదే తరహాలో టార్గెట్ చేస్తున్నారు కమలం నేతలు. కేసీఆర్ చెప్పినట్టు స్టీఫెన్ ఆడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. జోయల్ డేవిస్, స్టీఫెన్ రవీంద్ర.. ఇలాంటి పేర్లు కనిపిస్తే చాలు.. లేనిపోని ఆరోపణలతో అధికారులను ఇరికించేలా.. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ టీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి.