Veer Pahariya : బాలీవుడ్ నటుడు వీర్ పహారియా (Veer Pahariya) ‘స్కై ఫోర్స్’ (Sky Force) అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. అయితే ఓ ప్రముఖ స్టాండ్ – అప్ కమెడియన్ ఈ మూవీపై వేసిన పంచులు, వీర్ పహరియా అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో ఈవెంట్ జరిగిన ప్లేస్ లోనే అతన్ని చితకబాదారు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సదరు కమెడియన్, వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తాజాగా ఈ విషయం వీర్ పహారియా దృష్టికి రావడంతో ఆయన ఇంస్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే…
1965 ఇండో – పాక్ యుద్ధంలో జరిగిన వైమానిక దాడుల ఆధారంగా తెరకెక్కింది ‘స్కై ఫోర్స్’ (Sky Force) మూవీ. ఇందులో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒక లీడ్ రోల్ పోషించగా, వీర్ పహారియా ఈ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 160 కోట్ల బడ్జెట్ తో పొందిన ఈ మూవీ ఇప్పటిదాకా 100 కోట్లకు పైగానే రాబట్టింది. జనవరిలో రిలీజ్ అయిన ఈ మూవీపై ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ ప్రణీత్ మోర్ తన షోలో పంచులు వేశారు.
షోలాపూర్ లో జరిగిన ప్రణీత్ (Pranit More) స్టాండ్ అప్ కామెడీ షో అనంతరం, 11-12 మంది వ్యక్తులు గుంపుగా చేరి, అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా ఇంకోసారి వీర్ పహారియా గురించి జోకులు వేస్తే పరిణామాలు వేరే లెవెల్ లో ఉంటాయంటూ హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించిన ఫుటేజ్ ని అందించినప్పటికీ పోలీసులు తమకు సహాయం చేయలేదని ప్రణీత్ బృందం సోషల్ మీడియాలో ఆవేదనను వ్యక్తం చేసింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై పోలీస్ లకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేశారు.
వీర్ రియాక్షన్…
వీర్ పహారియా (Veer Pahariya) దీనిపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ క్షమాపణలు చెప్పారు. “కమెడియన్ ప్రణీత్ మోర్ కు జరిగిన ఘటనతో నేను నిజంగా షాక్ అయ్యాను. ఇందులో నా ప్రమేయం ఏమాత్రం లేదు. ఇలాంటి హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ట్రోలింగ్ ను కూడా నేను హుందాగా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇలా జరగడం నిజంగా బాధాకరం. దీనికి బాధ్యులైన వారు ఎవరో, వారిపై చర్యలు తీసుకోవడానికి నేను సహకరిస్తాను” అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం వీర్ తన తప్పు లేదంటూనే ‘సారీ’ చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈ వీర్ పహారియా ఎవరు?
వీర్ పహారియా (Veer Pahariya) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బాలీవుడ్ మూవీ లవర్స్ మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే అతను జాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా సోదరుడు. అతని తాత మహారాజా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే. తండ్రి సంజయ్ ఒక వ్యాపార దిగ్గజం, తల్లి స్మృతి ఓ నిర్మాణ సంస్థను నడుపుతోంది.