Vijay Devarakonda : తన వైవిధ్యమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ విజయ్ దేవరకొండ. రీసెంట్ గా వచ్చిన అతని ఖుషి మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అంటూ సంక్రాంతికి పక్క ఫ్యామిలీ మాన్ గా రావడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకొని చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చేసిన ఒక పని బాగా వైరల్ అయింది. ఇంతకీ అదేమిటో తెలుసా..?
ఎవరికన్నా సాయం చేయాల్సి వస్తే అందరికంటే ముందు ఉండే హీరో విజయ్ దేవరకొండ. ఖుషి సినిమా హిట్ అయిన సందర్భంగా 100 కుటుంబాలకు కోటి రూపాయలు సాయంగా అందివ్వాలి అని విజయ్ అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఈ హీరో చేసిన పని వల్ల ఒక చిన్నారి జీవితంలో ఆనందం నిండింది. ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన ఒక చిన్నారికి విజయ్ సాయం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చెందిన ఒక పాప ఇటీవల అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. విజయ్ దేవరకొండ అభిమాన సంఘం ద్వారా ఈ విషయం తెలుసుకున్న హీరో వెంటనే ఆ చిన్నారికి లక్ష రూపాయల చెక్కు పంపించడం జరిగింది. ఈ చెక్కును శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆ చిన్నారికి అందించారు. అలాగే చిన్నారికి సహాయం చేసి తన సహృదయం చాటుకున్న విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కూడా కురిపించారు. ప్రస్తుతం ఈ వార్తతో పాటు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ సహాయం చేసిన అమ్మాయి పేరు షర్మిల శ్రీ. ప్రమాదవశాత్తు ఆటో ఆక్సిడెంట్ వల్ల ఆ పాప ఒక కాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ బాలికకు అందించిన సహాయానికి ఆమె తరఫున ఎంపీ రామ్మోహన్ నాయుడు విజయ్ దేవరకొండకు అభినందనలు తెలిపారు. ఇక పాప కూడా వీడియోలో విజయ్ దేవరకొండకు “థాంక్యూ విజయ్ దేవరకొండ అన్న” అంటూ తన ధన్యవాదాలు తెలియజేసింది.ఇక ఈ వీడియోని రౌడీ ఫాన్స్ బాగా వైరల్ చేయడమే కాకుండా విజయ్ దేవరకొండ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. అతను చేసిన సహాయం ఒక పాప జీవితంలో మార్పు తీసుకువచ్చినందుకు నెటిజెన్లు కూడా సంతోషిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ హాట్ టాపిక్ గా మారాడు.