Vijay Sethupathi: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన.. తన ప్రతి పాత్రతో కూడా ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన తాజాగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కంటే ముందు ‘విడుదలై -2’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఈ సినిమా తర్వాత నటించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఏస్’. ఇందులో రుక్మిణి వసంత్(Rukhmini Vasanth) హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 23వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి వచ్చిన హీరో విజయ్ సేతుపతి మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
పూరీ జగన్నాథ్ తో మూవీ.. టైటిల్ పై హీరో రియాక్షన్..
అందులో భాగంగానే మొదట టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో చేస్తున్న సినిమా టైటిల్ పై ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..” మేము టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.. మాకంటే ముందు మీరే ఫిక్స్ చేశారు కదా.. ఎవరో ఏఐ సహాయంతో పోస్టర్ తయారు చేశారు. అది మనది కాదు.. పూరీ జగన్నాథ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన సినిమాలు ఇప్పటికే ఎన్నో చూశాను. స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆయన స్క్రిప్టు వినడానికి 2-3 రోజులు టైం పడుతుందేమో అనుకున్నాను. కానీ కొన్ని గంటల్లోనే పూర్తి చిత్రాన్ని నా కళ్ళ ముందు తీసుకొచ్చారు. జూన్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రేక్షకుడి కంటే కూడా నేనే ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ పూరీ జగన్నాథ్ తో మూవీపై అత్యుత్సాహం కనబరిచారు విజయ్ సేతుపతి.
రాజకీయ ఎంట్రీ పై విజయ్ సేతుపతి క్లారిటీ..
ఇక రాజకీయాల్లోకి రావడం పై విజయ్ సేతుపతికి ప్రశ్న ఎదురయింది. అందరిలాగే మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రశ్నించగా..” నేను విశాల్ ని కూడా అడిగాను రాజకీయాల్లోకి వస్తారా? అని.. అయితే నేను మాత్రం రాజకీయాల్లోకి రాను”.. అంటూ పక్కా క్లారిటీగా చెప్పేశారు విజయ్ సేతుపతి. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు ఈమాత్రం క్లారిటీ ఇస్తే చాలు ఇక వారి సినిమాల కోసం ఎదురుచూస్తారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పిన విజయ్ సేతుపతి ఇకపై మంచి మంచి కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తాను అని కూడా స్పష్టం చేశారు. మరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో విజయ్ సేతుపతి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ALSO READ:Rajinikanth: ‘కూలీ’ మూవీకి తెలుగులో భారీ డిమాండ్.. మరీ అన్ని కోట్లా..?