Vijaya Nirmala..దివంగత నటీమణి విజయనిర్మల (Vijayanirmala ) జయంతి నేడు. ఈ సందర్భంగా మనకు తెలియని, ఆమె సినీ జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2019 జూన్ లో అనంత లోకాల్లో కలిసిపోయి చిత్ర పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టారు అలనాటి అందాల తార విజయనిర్మల. విజయనిర్మల హీరోయిన్ మాత్రమే కాదు దర్శకురాలు కూడా.. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలిగా చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాదు తన అసాధారణ ప్రతిభతో ఒక మార్క్ క్రియేట్ చేసింది.. నీరజ గా తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత విజయనిర్మల గా మారి సహజనటిగా పేరు సొంతం చేసుకుంది.
గిన్నిస్ బుక్ లో స్థానం ..
దర్శకురాలిగా మారి ఏకంగా 42 చిత్రాలకు దర్శకత్వం వహించి.. అప్పటివరకు 27 చిత్రాల రికార్డు ఉన్న ఇటలీ దర్శకురాలి పేరు చెరిపేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది విజయనిర్మల. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు మహిళా దర్శకురాలు ఈమె కావడం విశేషం. 1957లో తెలుగులో వచ్చిన ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలనటిగా బాల కృష్ణుడిగా నటించి.. 60 ఏళ్లుగా సుదీర్ఘ సినీ ప్రస్తానాన్ని కొనసాగించింది. ముఖ్యంగా తన జీవిత భాగస్వామి కృష్ణ(Krishna ) తో ఏకంగా 50 చిత్రాలలో నటించి , మరొక రికార్డును క్రియేట్ చేసింది. విజయనిర్మల నటి దర్శకురాలు మాత్రమే కాదు టెక్నికల్ ఆర్టిస్ట్ కూడా ..ఈమెకు అలా మంచి పేరు తెచ్చిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’. ఆ తర్వాత ఏడాదికి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది.
మల్టీ స్టారర్ ప్రయోగం ఈమెతోనే ప్రారంభం..
విజయనిర్మల తన భర్త కృష్ణతో మరొక హీరోని జోడించి మల్టీ స్టార్ చిత్రాలు తెరకెక్కించింది. అలా అక్కినేని నాగేశ్వర రావు – కృష్ణ కాంబినేషన్లో ‘హేమా హేమీలు’, కృష్ణ – శివాజీ గణేషన్ కాంబినేషన్లో ‘బెజవాడ’, రజనీకాంత్ – కృష్ణ కాంబినేషన్లో ‘రామ్ రాబర్ట్ రహీమ్ ‘వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి అప్పట్లోనే మల్టీ స్టారర్ మూవీలతో ప్రయోగాలు చేసింది. అయితే ఈ చిత్రాలలో కొన్ని అద్భుత విజయాలు అందుకోగా మరికొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి. ఇక్కడ ఒకవైపు దర్శకురాలిగా, మరొకవైపు నటిగా భారీ పాపులారిటీ అందుకున్న విజయనిర్మల నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఇకపోతే ఈమె పరంపరను మళ్ళీ కొనసాగించడానికి ఈమె వారసుడు వీ.కే.నరేష్ (VK Naresh) ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఒకప్పుడు కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నరేష్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈమధ్య వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ బిజీగా మారారు. ఇకపోతే నరేష్ సినిమాల కంటే వ్యక్తిగత కారణాలవల్లే ఎక్కువగా వార్తల్లో నిలిచారు . మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆశ్చర్యపరిచిన ఈయన.. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ (Pavitra lokesh) తో సహజీవనం చేస్తూ.. 65 ఏళ్ల వయసులో మళ్లీ ఇలాంటి పనులేంటి అంటూ అందరి చేత మాట్లు పడ్డారు. ఇక మొత్తానికైతే నరేష్ తన తల్లి సినిమా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.