Madagajaraja Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో.. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), అంజలి(Anjali )హీరోయిన్లుగా దాదాపు 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ‘మదగజరాజా’అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత విడుదల అయిన ఈ సినిమా రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. ఇప్పుడు ఏకంగా రూ. 46 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇకపోతే ఇప్పుడు తెలుగులో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి, విక్టరీ వెంకటేష్ (Venkatesh) చేతులమీదుగా ట్రైలర్ ను లాంచ్ చేయడం జరిగింది.
ఆకట్టుకుంటున్న మదగజరాజా తెలుగు ట్రైలర్..
ఈ ట్రైలర్ లో మరొకసారి సంతానం (Santhanam )తన మార్క్ కామెడీని చూపించారు. విశాల్ డైలాగులు ఆకట్టుకున్నాయి. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. విశాల్ సంతానం, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సోనూసూద్ (Sonusoodh) కూడా కీలకపాత్ర పోషించారు. జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సుందర్ సి (Sundar.C) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో జనవరి 31వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ట్రైలర్ లో వెల్లడించారు.
తెలుగు సినిమాలకు గట్టి పోటీ..
వాస్తవానికి హీరో విశాల్ తెలుగు వాడే అయినా తమిళ్లో సత్తా చాటుతూ అక్కడ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ను మెప్పించడానికి.. తమిళంలో తాను నటించి, విడుదల చేసే సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తూ ఇక్కడి ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతికి మూడు భారీ బడ్జెట్ చిత్రాలు అనగా రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ(Balakrishna ) ‘డాకు మహారాజ్’ , వెంకటేష్ (Venkatesh ) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలను విడుదల చేశారు. అయితే ఈ సినిమాలకు పోటీగా తన సినిమా మదగజరాజాని కూడా తెలుగులో విడుదల చేయాలనుకున్నారు విశాల్. కానీ కుదరలేదుm దాంతో తమిళంలో మాత్రమే జనవరి 12వ తేదీన తన సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు జనవరి 31వ తేదీన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి 2013లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో ఈ సినిమాను చాలా కాలం పాటు పక్కన పెట్టేశారు విశాల్ . ఇప్పుడు మళ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఏది ఏమైనా విశాల్ తన నటనతో మరొకసారి అందరినీ ఆశ్చర్యపరిచారు అని చెప్పవచ్చు.