Congress Leaders: తెలంగాణలో దావోస్ ఒప్పందాల చుట్టూ పొలిటికల్‌గా సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఈసారి రికార్డు స్థాయి ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. ఇక్కడి వారినే దావోస్ తీసుకెళ్లి డీల్స్ కుదుర్చుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒప్పందాల వాల్యూను తక్కువ చేసి చూపించే ప్రయత్నాల్లో విపక్షాలు బిజీగా ఉన్నాయి. అటు రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను వేధిస్తున్నారన్న ప్రచారం పెంచుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు టీమ్ దావోస్ వెళ్లక ముందు ఒకలా విమర్శలు.. వెళ్లాక మరోలా విమర్శలు చేశారు. గ్రామసభలు పెట్టుకుని సీఎం విదేశాలకు వెళ్లడమేంటని హరీష్ రావు, అసలు ఒప్పందాలు ఇలాగేనా చేసుకోవడం, దావోస్ దాకా వెళ్లడం అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. తీరా ఒక లక్షా 78 వేల 950 కోట్ల రూపాయల పెట్టుబడులకు కంపెనీలు అంగీకరించగానే స్టోరీ మార్చేశారు. అసలు అందులో గ్రౌండింగ్ అయ్యేవెన్ని.. పేపర్లకే పరిమితమయ్యేవన్నంటూ కొత్త కథ మొదలు పెట్టారు. దీంతో కాంగ్రెస్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతోంది.
“తాజాగా ఇదే విషయంపై.. కేసీఆర్, కేటీఆర్‌లు జీర్ణించుకోలేకపోతున్నారంటూ హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు వెలిశాయి. కేసీఆర్, కేటీఆర్‌లకు ఈనో ప్యాకెట్లు అంటూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో భారీ పెట్టుబడులను, తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ బ్యానర్లు కనిపిస్తున్నాయి. కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ భారీగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. డైజెస్ట్ ది గ్రోత్ పేరుతో ఏర్పాటైన ఈ బ్యానర్లు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.”
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2050 థీమ్ ను దావోస్ లో ఆవిష్కరించారు. చాలా మంది పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ మీన్స్ బిజినెస్ గ్యాలరీ చాలా ఆకట్టుకుంది. ఇందులో ఫోర్త్ సిటీ, స్కిల్ వర్శిటీ, మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ నిర్మాణం ఇవే చాలా వరకు ఆకర్షించాయి. హైదరాబాద్ భవిష్యత్ ప్రాజెక్టులపై కంపెనీలు చాలా ఆసక్తి చూపి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి బృందం చాలానే శ్రమించింది. ఫ్యూచర్ విజన్ తోనే ఇది సాధ్యమైంది. పెట్టుబడి పెట్టిన కంపెనీ లోకలా.. ఫారినా ముఖ్యం కాదు.. అసలు ఇన్వెస్ట్ మెంట్ పెట్టేందుకు ముందుకొచ్చిందా లేదా అన్నదే పాయింట్. అందులోనూ దావోస్ వేదికగా డీల్స్ కుదిరితే తెలంగాణ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరుగుతుందని విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. సీఎం దూరదృష్టి వల్లే పెట్టుబడులు వచ్చాయన్న మాట వినిపిస్తున్నారు.
Also Read: హైడ్రా కూల్చివేతలు.. ఆగ్రహంతో రగిలిపోయిన మల్లారెడ్డి, తానేంటో చూపిస్తా
అద్భుతంగా డీల్స్ కుదిరితే కడుపు మంట ఎందుకన్నది టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్న. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో హడావుడి చేసి 25 వేల 750 కోట్లు మాత్రమే పెట్టుబడులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడేం జవాబిస్తారన్నారు. లోకల్ కంపెనీలతో డీల్స్ అని చెప్పడం చౌకబారు విమర్శలంటూ ఫైర్ అయ్యారు.
మరోవైపు హైదరాబాద్ ఆధారిత కంపెనీలను దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకోవటమేంటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో చాయ్ తాగుతూ పూర్తి చేయాల్సిన ఒప్పందాలను.. స్విట్జర్లాండ్‌లో హాట్ చాక్లెట్‌తో పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఉన్న వారితో దావోస్ లో అగ్రిమెంటా? ఏమీ అర్థం కావడం లేదన్నారు. అంతే కాదు.. తెలంగాణలో వ్యాపారవేత్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్లి ఒప్పందాలు చేసుకోవడం సరికాదంటున్నారు.
సో ఫైనల్‌గా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దావోస్ పెట్టుబడుల రూపంలో 25 వేల 750 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని, తమ రెండేళ్ల పాలనలోనే 2 లక్షల కోట్లు దాటాయని కాంగ్రెస్ అంటోంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు పెట్టుబడులను స్వాగతించాలంటున్నారు. మొత్తంగా దావోస్ డీల్స్ చుట్టూ మ్యాటర్ సవాళ్లు, ప్రతిసవాళ్లు అన్నట్లుగా మారింది.
హైదరాబాద్ వ్యాప్తంగా ENO హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు
" రూ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా ? అయితే ENO వాడండి " అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో
హోర్డింగ్‌లు ఏర్పాటు pic.twitter.com/8zThTwP13E— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025