Mallareddy On Hydra: హైదరాబాద్‌లో పలు చోట్ల హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మల్లారెడ్డి కట్టిన గోడను కూల్చి వేసింది. లేఅవుట్‌లో రోడ్డుకు అడ్డంగా ప్రహారీ గోడ నిర్మించారు. దీనిపై స్థానికులు హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఆక్రమించి కట్టారని నిర్థారించిన హైడ్రా, కట్టిన గోడను కూల్చివేసింది.
శనివారం ఉదయం 10 గంటలకు కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా నారపల్లి దివ్యనగర్ కూల్చివేతలకు వేదికైంది. ఘట్ కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. దీనిపై సర్వే చేసిన అధికారులు, ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించినట్టు గుర్తించారు.
జనవరి 8న కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. శుక్రవారం హైడ్రా ఆఫీసులో ఇరుపక్షాలతో చర్చించారు. దారులు మూసివేయడంతో లేఅవుట్లలో తమ ప్లాట్లు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ అమ్మినా మల్లారెడ్డి సమక్షంలో జరగాలని, ఇందుకు 50 వేల రూపాయలు చెల్లించాలని బాధితులు ఆరోపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న రంగనాథ్, ప్రహారీ నిర్మాణానికి అనుమతులు లేవని నిర్థారించారు. దీంతో శనివారం ఉదయం 10 గంటలకు దాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నల్ల మల్లారెడ్డి. కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్తానన్నారు. కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు ఈడుస్తానన్నారు. అదంతా తన సొంత భూములని, ఎలాంటి కబ్జాలు చేయలేదన్నారు.
ALSO READ: సీఐడీ చేతికి కిడ్నీ రాకెట్ కేసు.. ఆసుపత్రి ఛైర్మన్ సహా ఇద్దరు అరెస్ట్
కావాలని కొందరు తనపై హైడ్రాకు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. తానిచ్చిన ఫైల్స్, ఆధారాలు చూడకుండానే కూల్చివేతలు మొదలుపెట్టిందన్నారు. దివ్యనగర్ లే అవుట్‌ను తానే ప్రొటెక్ట్ చేశానని, అక్రమంగా నిర్మాణాలు సైతం ఆపానని గుర్తు చేశారు. ఈ విషయంలో తాను ఎవరినీ బెదిరించలేదన్నది మల్లారెడ్డి వెర్షన్.