Sandhya Theater Case : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలు అవ్వడంతో ఆమె భర్త థియేటర్ యాజమాన్యం పైన అలాగే హీరో అల్లు అర్జున్ పై పలు సెక్షన్స్ కింద కేసు పెట్టారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. బన్నీని కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు పలువురు ప్రముఖులు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇదిలా ఇండగా రేవతి భర్త ఇచ్చిన కంప్లైంట్ లో అసలు ఏముందనేది ఆసక్తిగా మారింది. అసలు ఆ కంప్లైంట్ లో ఏముందో తెలుసుకుందాం..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి భర్త పెట్టిన ఎఫ్ఐ ఆర్ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ చూడటానికి భార్య బిడ్డలతో సంధ్య థియేటర్‌కు వెళ్లగా అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సడెన్ గా థియేటర్ విజిట్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ క్రౌడ్‌తో థియేటర్ అంతా నిండిపోయింది. అలాంటి సమయంలో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా సరైన వసతులు ఏర్పాటు చేయకుండా ఎక్కువమంది జనాలను థియేటర్ లోపలికి అనుమతించి మాకు సీట్లు లేకుండా చేశారు. మమ్మల్ని కిందకు నెట్టివేసి నా భార్య మరణానికి, నా బిడ్డ శ్రీతేజ ఆస్పత్రిపాలు కావడానికి కారకులైన సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, తోపులాటకు కారణమైన అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చెయ్యాలని కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.
అయితే ఆయన పై బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కింద 5 నుంచి 10 ఏళ్ల శిక్ష.. బీఎన్ఎస్ 118(1) రెడి విత్ 3/5 సెక్షన్ కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు పడే అవకాశం ఉంది.. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా బన్నీకి జైలు శిక్ష తప్పేలా కనిపించలేదు.. ప్రస్తుతం ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లికి తీసుకెళ్ల నున్నారని సమాచారం.. ఇక ఈ అరెస్ట్ ముందే ఊహించిన బన్నీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆయన అరెస్ట్ పై మెగా హీరోలు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి అల్లు అర్జున్ భార్యను కలిసినట్లు తెలుస్తుంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.