Vishwak Sen:విశ్వక్ సేన్ (Vishwak Sen).. మాస్ హీరోగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. ఈ యేడాది ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేసిన చిత్రం లైలా. ప్రయోగాత్మకంగా లేడీ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన గెటప్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోవడం పైగా అసభ్యత ఎక్కువగా ఉండడం వల్లే పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (Prudhvi Raj) చేసిన కామెంట్లు అటు వైసిపి అభిమానులను పూర్తిస్థాయిలో హర్ట్ చేశాయి. దీంతో #డిజాస్టర్ లైలా , #బాయ్ కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేశారు. ఇక ఎట్టకేలకు సినిమా పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వంలో ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రానికి దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ రూ.18 కోట్లు మాత్రమే రావడంతో ఈ సినిమా ఎంత డిజాస్టర్ గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో తాజాగా ఒక సుదీర్ఘ లేఖ వదులుతూ విశ్వక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై నా సినిమాలలో అసభ్యత ఉండదు – విశ్వక్..
ప్రతి ఒక్కరికి నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి వెళ్లలేకపోయాయి. నా చివరి సినిమా లైలాకి వచ్చిన నిర్మాణాత్మక విమర్శను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ప్రాధాన్యత ఎప్పుడూ కూడా కొత్తదనం తీసుకురావడమే.. కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను కూడా నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్, మాస్ ఏదైనా సరే అసభ్యత లేకుండా ఉండేలా చూసుకుంటాను.
ఆ హక్కు మీకుంది-విశ్వక్
నేను ఏదైనా ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను పూర్తిగా విమర్శించే హక్కు మీకుంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే కదా.. నా కెరియర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయికలు , దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో మీ ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాలలో నన్ను నమ్మి, నన్ను నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇక మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం అంటూ ఒక సుదీర్ఘ లేఖ పంచుకున్నారు విశ్వక్ సేన్. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ చేసిన ఈ సుదీర్ఘ నోట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపై బలమైన కథతో మనసుకు హత్తుకునేలా ప్రేక్షకుల ముందుకు వస్తానని మాట ఇస్తున్నారు. మరి ఆ సినిమా కోసం ఎంతలా ఎఫర్ట్ పెడతారో చూడాలి.