13 Killed in the Same Family died in Terrible Road Accident: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. అదేవిధంగా మరో తొమ్మిది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాహోర్ కు 350 కిలో మీటర్ల దూరంలోని ముజఫర్ గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్యాసింజర్ వ్యాన్ – ట్రక్కు ఢీ కొనడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందారు. ఇందుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్రజలు, రెస్య్కూ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 11 మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారని తెలిపారు.
మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 13 మంది, క్షతగాత్రులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు పేర్కొన్నారు. తమ బంధువులను కలిసేందుకు ముల్తాన్ కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
Also Read: విరిగిపడిన కొండ చరియలు.. 2 వేల మంది సజీవ సమాధి
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. వేగంగా ట్రక్కును నడపడంతో కంట్రోల్ తప్పిందని, ఈ క్రమంలోనే ట్రక్కు వ్యాన్ ను ఢీకొట్టిందన్నారు. ట్రక్కు డ్రైవర్ ను అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.