BigTV English

Al-Houthi : పశ్చిమదేశాల కంట్లో నలుసు.. అల్-హౌతీ..

Al-Houthi : పశ్చిమదేశాల కంట్లో నలుసు.. అల్-హౌతీ..
Al-Houthi

Al-Houthi : యెమెన్‌లో హౌతీ రెబెల్స్ లక్ష్యాలపై అమెరికా వరుసగా రెండో రోజూ గురిపెట్టింది. దాదాపు 30 స్థావరాలపై దాడులు చేసింది. శనివారం యెమెన్‌లోని రాడార్ సైట్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులతో పశ్చిమదేశాలను కవ్వించి ముగ్గులోకి దింపడం వెనుక హౌతీల నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ తెంపరితనం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలను రగల్చడం ద్వారా ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యాల కంట్లో నలుసుగా మారాడు.


కదన రంగంలో అల్-హౌతీ అతి క్రూరుడనే పేరుంది. అమెరికా, బ్రిటన్ నావికా దళాలకు హౌతీలు కంటి మీద కునుకు లేకుండా చేయగలుగుతున్నారంటే దానికి కారణం అల్-హౌతీ ఎత్తుగడలు, వ్యూహాలే. 40 ఏళ్ల వయసున్న అతని నాయకత్వంలోనే బలమైన గ్రూపుగా హౌతీ ఎదగగలిగింది. సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణసేనలను ఎదురొడ్డి నిలబడటమే కాకుండా.. అత్యంత బలమైన గ్రూప్‌గా విస్తరించగలిగింది.

వేల సంఖ్యలో సభ్యులను, భారీ ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోగలిగింది. అల్-హౌతీ నాయకత్వ పటిమ వల్ల సాయుధ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు రెబెల్స్ అమ్ములపొదిలో చేరాయి. 2022 జనవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో గల్ఫ్ టూరిజం అండ్ కమర్షియల్ హబ్‌పై క్షిపణి దాడి చేయడంతో హౌతీల ఆయుధ సత్తా లోకానికి తెలిసింది.


భద్రత, వ్యూహాత్మక కారణాలతో ఎప్పుడూ ఒకే ప్రాంతాన్ని అంటి పెట్టుకుని ఉండటం అల్-హౌతీకి అలవాటు లేదు. ఒకవేళ పరిస్థితుల వల్ల అలా ఉన్నా.. అది అత్యంత అరుదే అని చెప్పొచ్చు. మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇక బహిరంగంగా ప్రజల్లో తిరిగేందుకూ అల్-హౌతీ అంగీకరించడు. యెమెన్ యుద్ధం ఆరంభమైన అనంతరం ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా అతను కలిసింది లేదని హౌతీ కార్యకలాపాలను నిశితంగా పరిశీలించే ఓ అధికారి చెప్పారు.

ఎంతో మంది జర్నలిస్టులు అల్-హౌతీని కలిసేందుకు ఆసక్తి చూపేవారు. భేటీ కావాలని కోరుకునేవారు. అయితే అలాంటి అవకాశం చిక్కిన వారిని హౌతీ సెక్యూరిటీ కాన్వాయ్ వెంటబెట్టుకుని వెళ్లేది. హౌతీలకు పట్టున్న సనాలో ఓ ఇంటికి తీసుకెళ్లేవారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ ఇంట్లో పైనున్న గదికి పంపేవారు. అల్-హౌతీ అక్కడ ఓ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యేవాడు. అంతే తప్ప.. ఏ ఒక్కరూ అతడిని నేరుగా చూసింది లేదనేది ప్రతీతి.

జైదీ షియాల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంతో హౌతీ ఉద్యమం ఆరంభమైంది. మైనారిటీ తెగ అయిన జైదీ షియాలు యెమెన్‌ను వెయ్యేళ్లు పరిపాలించారు. 1962 వరకు వారిదే పాలనాధిపత్యం. అనంతరం క్రమేపీ వారి ప్రాభవం తగ్గింది. 1990-2012 మధ్య అలీ అబ్దుల్లా సలేహ్ పాలనతో జైదీ షియాలు మరుగున పడిపోయారు.

ప్రాంతీయంగా ప్రాబల్యం పెంచుకునేందుకు ఇరాన్ హౌతీలకు మద్దతు ఇచ్చింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లాతో పాటు ఇరాక్, సిరియాల్లోని చిన్న చిన్న సాయుధ గ్రూపులను అక్కున చేర్చుకుంది. అయితే తామేమీ ఇరాన్ చేతిలో కీలుబొమ్మలం కాదని, అవినీతి వ్యవస్థపై పోరాటమే తమ లక్ష్యమని హౌతీ రెబెల్స్ తరచూ చెప్పేమాట.

హౌతీలకు ఆయుధాలను ఇరాన్ సమకూరుస్తోందని సైనిక శిక్షణ కూడా ఇస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. అయితే లెబనాన్‌లోని హెచ్‌బొల్లాతో పోలిస్తే.. హౌతీలు ఎక్కువ స్వతంత్రులుగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. తనది మహ్మద్ ప్రవక్త వంశమని అల్-హౌతీ చెప్పుకునేవాడు. గతంలో రికార్డు చేసిన అతడి ప్రసంగాలను గమనిస్తే ఇది బోధపడుతుంది.

మతం కారణంగానే హౌతీ ఉద్యమం ముప్పేట ముట్టడిలో చిక్కుకుందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు. మహోన్నతమైన ఇస్లామిక్ విలువలను, దానితో మనకున్న బలమైన అనుబంధాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఓ ప్రసంగంలో అల్-హౌతీ పిలుపునిచ్చాడు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×