Netanyahu Arrest Warrant| ఎట్టకేలకు ఇజ్రాయెల్ చేస్తున్న అరాచకాలకు అంతర్జాతీయ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో యుద్దనేరాలకు పాల్పడినందుకు అంతర్జతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి).. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యొఆవ్ గల్లంత్, హమాస్ నాయకుడు మొహమ్మద్ దియబ్ ఇబ్రహీం అల్ మస్రీలకు గురువారం నవంబర్ 21, 2024న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
హమాస్ పై చేస్తున్న యుద్ధంలో అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ.. మానవత్వానికి వ్యతిరేకంగా ఆస్పత్రులపై, ప్రార్థనా స్థలాలపై బాంబు దాడులు చేసి.. వేల మంది అమాయక ప్రజలను హత్య చేసిన నేరాలకు గాను ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై దాడులు చేసినందుకు హమాస్ నాయకులకు, పాలస్తీనా భూభాగమైన గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రిని అరెస్ట్ చేయాలని కోరుతూ మే 20, 2024న ఐసిసి ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ పిటీషన్ దాఖలు చేశారు.
Also Read: ఇక మూగజీవాలను చంపే ఉద్యోగం చేయలేను.. పశువుల డాక్టర్ సూసైడ్ లెటర్
ఈ పిటీషన్ విచారణ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు.. హమాస్, ఇజ్రాయెల్ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే గాజాలో అమాయక ప్రజల చావుకి కారణమని నిర్ధారించింది. గాజా ప్రజలకు ఆహారం, నీరు, వైద్యం, విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నారని.. దీనంతటికీ హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ ప్రభుత్వం కారణమని ఐసిసి త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటిస్తూ.. బాధ్యులకు అరెస్ వారెంట్ జారీ చేసింది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ నేరస్తులను పై చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఐసిసి అదేశాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించింది. ఐసిసి పరిధిలోకి తమ దేశం లేదని, గాజాలో ఎటువంటి యుద్ధనేరాలకు పాల్పడలేదని ప్రకటించింది. మరోవైపు హమాస్ నాయకుడు మొహమ్మద్ దియబ్ ఇబ్రహీం అల్ మస్రీ అలియాస్ దైఫ్ ను హతమార్చినట్లు తెలిపింది.
అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 44,056 మంది గాజా పౌరులు చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లోనే 71 మంది ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారని సమాచారం.
గాజాలో ఐక్యరాజ్యసమితి, భారత దేశం సహా ఇతర దేశాలు మానవత్వ దృక్పథంలో ప్రజలకు ఆహారం, నీరు, వైద్యానికి మందులు సరఫరా చేస్తున్నా.. ఇజ్రాయెల్ ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోంది. గాజా వాసులకు సేవలు అందిస్తున్న ఐరాస కార్యకర్తలు దాదాపు 200 మంది సైతం ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవడం గమనార్హం.
గాజాలో అమాయక ప్రజలకు ఆహారం అందనివ్వకుండా చేసి.. వారిని చంపేందుకు ఇజ్రాయెల్ కుట్రచేస్తోందని చాలాసార్లు మానవ హక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయినా ఇజ్రాయెల్ వాటిని లెక్కచేయకుండా దాడులు చేస్తూనే ఉంది. ఐసిసి అధికారాలకు అగ్రరాజ్యం అమెరికా కూడా గుర్తింపు ఇవ్వలేదు. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచదేశాలు.. తాజాగా గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేసేందుకు ప్రతిపాదన చేయగా.. అమెరికా తన వీటో అధికారంతో ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో యుద్దం పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న అరాచకాలకు అమెరికా సమర్థిస్తున్నట్లే అని విశ్లేషకుల అభిప్రాయం.