Azerbaijan president : అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇటీవల కజికిస్థాన్ లో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో పక్షి ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందనే మొదట ప్రచారం జరిగింది. కానీ తర్వాత విమానం పై భాగం తీవ్రంగా దెబ్బ తిని ఉండడంతో అనేక ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. విమానంపైకి కాల్పులు జరిగాయని, అందుకే విమానం కుప్పకూలిందని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ కాల్పులు రష్యా భూ భాగం నుంచి జరిగాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతూ అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ కీలక ప్రకటన చేశారు.
విమాన ప్రమాదం పక్షి ఢీ కొట్టడం వల్ల జరిగింది కాదని తేల్చేశారు. విమానం పైకి రష్యా భూభాగం నుంచి కాల్పులు జరగడం వల్లే ప్రమాదానికి గురైందని ఆరోపించారు. అయితే రష్యా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడిందని చెప్పలేదని, వారి గగనతలంలో ప్రయాణించే సమయంలో జరిగిన పొరబాటుగా పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి దారి తీసిన కారణాల గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేయటం సరైన విధానం కాదని అన్నారు. జరిగిన వాస్తవాన్ని ప్రజల ముందుంచాలని కోరారు. కానీ.. ప్రమాద విషయం తెలిసిన తర్వాత కూడా రష్యా నిజాన్ని దాచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని ఆరోపించారు. ఇలా వ్యవహరించడం విచారకరమన్న అజర్ బైజాన్ అధ్యక్షుడు.. ఘటన తర్వాత మొదటి మూడు రోజులు తప్పుడు వాదనలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
రష్యా తప్పిదం కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని పరిగణించాలన్న అజర్ బైజాన్ అధ్యక్షుడు.. జరిగిన పొరబాటుకు క్షమాపణలు చెప్పి తప్పును అంగీకరించాలని డిమాండ్ చేసారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారం చెల్లించాలని రష్యాను డిమాండ్ చేశారు. అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కి చెందిన జే2- 8243 విమానం కజికిస్థాన్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విమానం అజర్ బైజాన్ లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆ సమయంలో క్షిపణుల ప్రయోగం..
ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోకి ప్రవేశించాయి. గతంలోనూ ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోకి చొచ్చుకెళ్లి అనేక దాడులు చేశాయి. వీటిని కూల్చేందుకు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయి. పైగా.. ఈ విమానం ప్రయాణించే సమయంలోనే ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని గ్రోజ్ని పైకి దండెత్తాయి. దీంతో.. విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్ గా పరిగణించి.. రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులు, కాల్పులు జరిపిందని భావిస్తున్నారు. క్రెమ్లిన్ సైతం ప్రమాదం జరిగిన రోజు గ్రోజ్నిలో తమ రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగించిందని ప్రకటించింది.
Also Read : ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన చైనా బుల్లెట్ ట్రైన్.. దీని వేగం ఎంతో తెలుసా?
అయితే.. తాము ప్రయోగించిన క్షిపణులు విమానాన్ని తాకాయని రష్యా అంగీకరించలేదు. కానీ.. ఈ ఆరోపణల సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. విమాన ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. అజార్ బైజాన్ దేశాధినేతకు క్షమాపణలు చెప్పారు. కానీ ప్రమాదానికి తానే కారణమని వస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించలేదు. విమాన ప్రమాదానికి తామే బాధ్యులమని ప్రకటించలేదు. అదే సమయంలో ఈ వ్యవహారంపై అజర్ బైజాన్ అధ్యక్షుడితో పుతిన్ ఫోన్లో మాట్లాడినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది.