China’s Fastest Train : సరికొత్త ఆవిష్కరణలతో చైనా ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక వేగంగా గంటకు 450 కి.మీ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా అత్యధిక వేగంతో ప్రయాణించే అత్యాధునిక రైలుగా ఇది గుర్తింపు పొందింది. ఈ రైలును ప్రస్తుతానికి సీఆర్-450 గా వ్యవహరిస్తున్నారు. దీనిని ఆదివారం నాడు బీజింగ్ లోని హై స్పీడ్ రైల్వే ట్రాక్ పై పరీక్షించారు. ఈ పరీక్షల్లో సీఆర్-450 రైలు గంటకు 400 కి.మీ వేగాన్ని అందుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా.. ఇదీ ప్రాథమిక పరీక్షల్లో గంటలకు 450 కి.మీ ప్రయాణించగలదని చైనా రైల్వే వెల్లడించింది.
ఆకట్టుకునేలా సన్నని పక్షి ముక్కులా తీర్చిదిద్దిన ఈ బుల్లెట్ ట్రైన్ డిజైనింగ్ అద్భుతంగా ఉంది. ఈ రైలు ప్రస్తుతం పరీక్షల దశలో ఉండగా.. పూర్తి స్థాయిలో పట్టాలెక్కించే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే వాణిజ్య రైలుగా రికార్డు సృష్టిస్తుందని చైనా రైల్వే తెలిపింది. కాగా ఈ రైలును బీజింగ్ నుంచి షాంఘై వరకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోగలదని వెల్లడించారు. గతంలో అయితే ఈ ప్రయాణ దూరానికి 4 గంటల సమయం పట్టేది.
ప్రస్తుతం రూపొందించిన సీఆర్- 450 ప్రోటో టైప్ రైలు బరువు కేవలం పది టన్నులు మాత్రమే కావడం గమనార్హం. దీనికి ముందు రూపొందించిన సీఆర్- 400 బుల్లెట్ ట్రైన్ తో పోలిస్తే ఇది పది శాతం తక్కువ ఉండడంతో పాటు 20 శాతం తక్కువగా విద్యుత్ వినియోగించుకుంటుందని చైనా రైల్వే వెల్లడించింది. చైనాలోని విస్తారమైన కనెక్టివిటీని సులువుగా చేరుకునేందుకు ఇలాంటి బుల్లెట్ ట్రైన్ల అవసరం చాలా ఉందన్న చైనా రైల్వే.. తాము తమ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా సేవలందించేందుకే నిత్యం కృషి చేస్తున్నామని తెలిపింది. రైల్వే సాంకేతికత ఆవిష్కరణలో ప్రపంచంతో పోటీ పడటంతో పాటు అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలవాలనే తమ సంకల్పానికి ఈ రైలు ఓ సంకేతమని తెలిపింది.
Also Read : హెబ్ వన్‌బి వీసాల కోసం యుద్ధమైనా చేస్తా.. ట్రంప్ మద్దతుదారులపై మస్క్ మండిపాటు
చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా.. విస్తృతంగా హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలను నిర్మించనున్నారు. కాగా.. ప్రస్తుతం చైనాలో హై స్పీడ్ రైల్వే వ్యవస్థ చాలా పెద్దది. చైనాలో మొత్తం 46 వేల కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ ను నిర్మించారు. ఇది ప్రపంచంలో మరే దేశంలో లేనంత భారీ నెట్ వర్క్. అంతర్జాతీయంగా అత్యధిక వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ఆవిష్కరణలో చైనా అగ్రగామిగా ఉంది. ఈ దేశంలో తయారు చేసిన షాంఘై మంగ్లేవ్ అత్యధికంగా 430 కి.మీ వేగంతో ప్రయాణిస్తుండగా,
CR Fuxing, CR Harmony అనే రైళ్లు అత్యధికంగా గంటకు 350 కి.మీ వేగంతో దూసుకుపోతున్నాయి. ఇవి చైనాకు చెందిన రైళ్ళు. వీటి తరువాత… జర్మనీ, స్పానిష్, ఫ్రెంచ్, జపాన్ కు చెందిన బుల్లెట్ ట్రైన్లు వేగంలో చైనా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.