Bangladesh Violance: స్వదేశానికి వస్తున్నానని మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఇంటిపై దాడి చేసి తగలబెట్టారు. ఈ ఘటన ఆదేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చట్టోగ్రామ్‌లోని ప్రభుత్వ మాజీ తాత్కాలిక అధిపతి మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఢాకాలో నాటు బాంబులు పేలడం, రాజకీయ నేతల ఆస్తులపై దాడులు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ వ్యాప్తంగా పలుచోట్ల అవామీ లీగ్-బీఎన్‌పీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు కంటిన్యూ అవుతున్నాయి.
అదే సమయంలో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన నిషేధిత అవామీ లీగ్ పునరుజ్జీవాన్ని నిరోధించడానికి ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ఉండాలని ప్రధాని తారిక్ రెహమాన్ పిలుపు ఇచ్చారు. గడిచిన రెండు రోజులుగా జరిగిన హింసలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. సిల్హెట్, రాజ్‌షాహి, బరిశాల్, ఫరీద్‌పూర్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో యూనస్ గ్రామీణ బ్యాంక్ లకు చెందిన అనేక శాఖలను లక్ష్యంగా చేసుకున్నారు.
భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నాటు బాంబుపేలుళ్లు, దహనాలు, దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన జిల్లాల్లో వేలాది మంది పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలను మోహరించింది. ఢాకాలో గడిచిన 24 గంటల పాటు జరిపిన దాడుల్లో పోలీసులు 565 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని స్థానిక పత్రికలు రాసుకొచ్చాయి. అరెస్టయిన వారిలో మాజీ విద్యాశాఖ మంత్రి నూరుల్ ఇస్లాం నహిద్ ఉన్నారు.
ALSO READ: అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!
ఇదిలావుండగా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని రెహమాన్, అవామీ లీగ్ పార్టీని ఉగ్రవాద సంస్థగా వర్ణించారు. అవామీ లీగ్ కార్యకర్తలు మరోసారి దేశానికి, ప్రజలకు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పతనమైన, ఓడిపోయిన, బహిష్కరించబడిన ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవడం, వారి కుట్రలను భగ్నం చేయాలని దేశంలోని మిగతా రాజకీయ పార్టీలకు ఆయన పిలుపు ఇచ్చారు.