పాకిస్తాన్ ఓవైపు ఉగ్రమూకలతో భారత్ లో అలజడులు రేపాలని చూస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ కూడా తోడ జాడిస్తోంది. నిన్న మొన్నటి వరకు భారత్ స్నేహ హస్తం కోసం అర్రులు చాచిన ఆ దేశం, ప్రధానిగా షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత స్వరం పెంచింది. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న మహ్మద్ యూనస్ సహా.. ఆ దేశానికి చెందిన కీలక నేతలు, మాజీ అధికారులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. యూనస్ కి సన్నిహితుడైన ఫజ్లుర్ రెహ్మాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే.. బంగ్లాదేశ్ భారత్ పై దాడి చేయాలన్నారు. అలా దాడి చేసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని చెప్పారు. ఈ దాడికి చైనా సహాయం కావాలని కూడా కోరారు. భారత్ పై దాడి చేయాలనే ఆలోచన రావడమే దుర్మార్గం. పైగా అలాంటి ఆలోచనని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పాకిస్తాన్ కి తాము మద్దతిస్తున్నట్టుగా ఫజ్లుర్ రెహ్మాన్ మాట్లాడటం మరింత దారుణం. భారత్ ఈ వ్యాఖ్యలను గమనిస్తోంది, సరైన సమయంలో సరైన సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది.
ఫజ్లుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ మేజర్ జనరల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. బంగ్లా రైఫిల్స్ కి కూడా ఆయన అధిపతిగా పనిచేశారు. బంగ్లా రక్షణ శాఖ ఇప్పటికీ ఆయన సలహాలు పాటిస్తుంది. అందులోనూ ఆయన బంగ్లా ప్రస్తుత ప్రధాన సలహాదారుగా ఉన్న మహ్మద్ యూనస్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
ఆ ఏడు రాష్ట్రాలు..
భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం ఎప్పట్నుంచో చైనా, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరోక్ష చర్యల ద్వారా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటాయి. చైనా దురాక్రమణలకు ప్రయత్నిస్తూనే ఉంది, భారత్ ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను తిప్పికొడుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ కి అంతటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పబ్బం గడుపుతోంది. తాజాగా ఫజ్లుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొంటున్న తరుణంలో ఫజ్లుర్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇక్కడ పహల్గాంలో పర్యాటకుల్ని దుర్మార్గంగా కాల్చి చంపింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులనే విషయం అందరికీ తెలుసు. మరి దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన బాధ్యత భారత్ పై ఉంది. ఈ విషయంలో బంగ్లాదేశ్ కలుగజేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. కానీ పాక్ తో అంటకాగాలని బంగ్లా కొత్త ప్రభుత్వం, దాని సలహాదారు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే పాక్ పై భారత్ యుద్ధం మొదలు పెడితే, తాము ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ఆ దేశ సలహాదారు సన్నిహితుడు ప్రగల్బాలు పలుకుతున్నాడు.
యూనస్ కూడా తక్కువేం కాదు..
బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మహ్మద్ యూనస్ కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఈశాన్య రాష్ట్రాలైన సెవన్ సిస్టర్స్ కి సముద్ర తీర ప్రాంతం లేదని.. అక్కడి సముద్రానికి ఏకైక సంరక్షకుడు బంగ్లాదేశ్ మాత్రమేనని అన్నారు యూనస్. పరోక్షంగా చైనాకు మద్దతిస్తూ మాట్లాడారు. ఆయన్ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతే కాదు, బంగ్లాదేశ్ తో ఐదేళ్ల కోసం చేసుకున్న కార్గో ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసుకుంది. దీంతో బంగ్లాకు బుద్ధి చెప్పినట్టయింది.
అయితే తాజా వ్యాఖ్యలతో బంగ్లా మరోసారి రెచ్చిపోయింది. ఈసారి కేవలం మాటలతో కాదు, చేతలతో మనం బదులు చెప్పాలని అంటున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ కొమ్ములు విరిచే సమయంలోనే బంగ్లాదేశ్ తోక కూడా కత్తిరించాలంటున్నారు.