NAVIC Map : ఇస్రో రూపొందించిన స్వదేశీ నేవిగేషన్ వ్యవస్థ… నావిక్‌ను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023 జనవరి నుంచి దేశంలో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్లలో నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరచాలని సెల్ ఫోన్ తయారీదారులైన యాపిల్, శాంసంగ్, షావోమీ, ఓప్పో, వివో లాంటి కంపెనీలకు స్పష్టం చేసింది. అయితే దీనికి కొంత సమయం కావాలని సెల్ ఫోన్ కంపెనీలు కోరుతున్నాయి. నావిక్ నేవిగేషన్ వ్యవస్థను ఇన్ స్టాల్ చేయాలంటే… సెల్ ఫోన్ల హార్డ్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందని… అందుకే ఇంకాస్త సమయం ఇవ్వాలని కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పైగా వచ్చే ఏడాది భారత మార్కెట్లలోకి లాంచ్ చేయాల్సిన మొబైల్ ఫోన్ల తయారీని ఇప్పటికే ప్రారంభించినందున… గడువు పొడిగించాలని విన్నవించాయి.
కొన్ని కంపెనీలు మాత్రం… అమెరికా జీపీఎస్‌ను అందిస్తున్న ఎల్1 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే ‘నావిక్’ను కూడా అందించాలని ప్రతిపాదించాయి. అలా అందిస్తే… జీపీఎస్ తో పాటు నావిక్ ను కూడా పొందుపరిచి మొబైల్ ఫోన్లను తయారు చేయొచ్చని అంటున్నాయి. కానీ… ఈ ప్రతిపాదనను ఇస్రో తిరస్కరించింది. తన సొంత ఎల్5 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే నావిక్‌ను అందుబాటులో ఉంచుతామని తేల్చిచెప్పింది. దాంతో… ఈ అంశంపై మొబైల్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అవి పూర్తయితే… దేశీయ ఫోన్లలో నావిక్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది తేలిపోతుంది.
నిజానికి 2018 నుంచే నావిక్ ను రక్షణ, పోలీసు శాఖలు విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. కేంద్ర రక్షణ శాఖతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖలు నావిక్ వ్యవస్థను వాడుతున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లకు, ప్రకృతి విపత్తుల గురించి తెలుసుకోవడానికి, సహాయ–పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి, వాహనాలను ట్రేస్ చేయడానికి నావిక్‌ను ఉపయోగిస్తున్నారు. అమెరికా జీపీఎస్ కంటే… నావిక్ మెరుగైన, కచ్చితమైన నావిగేషన్ పరిజ్ఞానాన్ని అందిస్తోందనేది నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే… అమెరికా జీపీఎస్ ఉపగ్రహాల కన్నా… మన నావిక్ ఉపగ్రహాలే ఇంకా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. అంతేకాదు… డ్యూయల్ ఫ్రీక్వెన్సీ బాండ్ల సాయంతో నావిక్ పని చేస్తుంది కాబట్టి… చాలా కచ్చితమైన జియో పొజిషనింగ్ సమాచారాన్ని అందిస్తోంది. ఇదీ మన ఇస్రో సత్తా.