పాకిస్తాన్ మనకు ఆగర్భ శత్రువు, కానీ చైనా అలా కాదు. మన పొరుగున ఉంటూ మనతో స్నేహం నటిస్తూ మన శత్రు దేశం పాకిస్తాన్ కు సాయం చేస్తుంటుంది. అంటే పాక్ కంటే చైనా మరింత ప్రమాదకారి అనమాట. ఆమధ్య ఆపరేషన్ సిందూర్ అటాక్ ని కాచుకోడానికి పాకిస్తాన్ ఉపయోగించిన రక్షణ వ్యవస్థ కూడా చైనా తయారీ కావడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన ఏ ఆయుధం కూడా సమయానికి సరిగా పనిచేయలేదు. రక్షణ వ్యవస్థతో సహా కొన్నిరకాల డ్రోన్లు కూడా తుస్సుమన్నాయి. అయినా కూడా చైనా అంటే పాక్ కి ఎక్కడలేని నమ్మకం. చైనాకి కూడా పాక్ అంటే వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమతోటే పాకిస్తాన్ కోసం ఓ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించింది చైనా.
సొంత నేవిగేషన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకోడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. భారత్ కూడా నావిక్ పేరుతో సొంత నావిగేషన్ సిస్టమ్ ని అభివృద్ధి చేస్తోంది. కానీ పాక్ కి అలాంటి వ్యవస్థ లేదు. అది ఇప్పటి వరకు విదేశీ వ్యవస్థలపైనే ఆధారపడింది. తాజాగా పాకిస్తాన్ కోసం చైనా ఆ సాయం కూడా చేసింది. సిచువాన్ ప్రావిన్స్ లోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి కుయ్‌జౌ 1A క్యారియర్ రాకెట్ ని చైనా తాజాగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా పాకిస్తాన్ కోసం ఓ రిమోట్-సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా అంతరిక్షంలోకి పంపింది. కుయ్ జౌ 1A మోడల్ కి సంబంధించి ఇది 29వ ప్రయోగం. అదే సమయంలో చైనా చేపట్టిన 42వ అంతరిక్ష ప్రయోగం. హుబే ప్రావిన్స్‌లోని చైనా స్పేస్ సంజియాంగ్ గ్రూప్ ఈ రాకెట్ ని అభివృద్ధి చేసింది. దీని పొడవు 20 మీటర్లు. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఘన-చోదక రాకెట్ ఇది. 30 మెట్రిక్ టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువును కలిగి ఉంటుంది, 200 కేజీల పేలోడ్ ను ఇది సుదీర్ఘ కక్ష్యల్లో ప్రవేశ పెట్టగలదు. తక్కువ ఎత్తులోని భూ కకక్ష్యల్లో 300 కేజీల పేలోడ్ ని ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది.
చైనా తయారీ..
షాంఘైకి చెందిన ఇన్నోవేషన్ అకాడమీ ఫర్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఉపగ్రహాలను తయారు చేస్తుంది. ఈ అకాడమీయే పాకిస్తాన్ కోసం నావిగేషన్ శాటిలైట్ తయారు చేసింది. ఈ విషయాన్ని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్ప్ అధికారికంగా ధృవీకరించింది. ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ప్రధానంగా భూ వనరుల నిర్వహణ, విపత్తు నివారణకు సంబంధించిన వివరాలను పంపిస్తుంది. సముద్రంలోని వస్తువులను పరిశీలించడం, సర్వే నిర్వహణ, వాతావరణ పర్యవేక్షణకు కూడా ఇది సాయపడుతుంది.
అత్యాధునిక టెక్నాలజీ..
పాక్ కోసం చైనా తయారు చేసిన ఈ శాటిలైట్ లో అత్యాధునిక ఇమేజింగ్ వ్యవస్థలున్నాయి. దీనికి ఉన్న అధునాతన సెన్సార్లు వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, హిమానీనదాలు కరగడం, అటవీ నిర్మూలన వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా కచ్చితంగా అంచనా వేయగలుగుతుంది. ఆమేరకు నష్టనివారణలో సాయపడుతుంది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కి కూడా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.