China Military Parade: బీజింగ్ తియాన్మెన్ స్క్వేర్ లో చైనా తన ఆయుధ సంపత్తిని పూర్తిగా డిస్ ప్లే చేసింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లైనందుకు గుర్తుగా చైనా ఈ భారీ విక్టరీ పరేడ్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా శాంతి కోసం కట్టుబడి ఉంటామని, అలాగే అణు ఆయుధ రహిత ప్రపంచం పై మాట్లాడుతూనే.. చైనాను ఏ శక్తి ఆపలేదని, తమపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని జిన్ పింగ్ అన్నారు. ఇంతకీ ఈ పరేడ్ ద్వారా చైనా ప్రపంచానికి ఏం మెసేజ్ పంపింది?
ఆయుధ బలాన్ని, బలగాన్ని చాటిన చైనా
సెప్టెంబర్ 3న చైనీస్ మిలటరీ పరేడ్ ఫుల్ డిస్ ప్లేను చూశారు. గత 66 ఏళ్లలో ఓ నార్త్ కొరియా అధ్యక్షుడు చైనా మిలటరీ పరేడ్ కు రావడం ఇదే తొలిసారి. పైగా కిమ్ తన కూతురితో వచ్చాడు. అయితే ఆమె కనిపించలేదు.తన ఆయుధ బలాన్ని, బలగాన్ని యావత్ ప్రపంచానికి చూపించింది డ్రాగన్.సైనిక ఆధునికీకరణ, గ్లోబల్ సూపర్ పవర్‌గా తన సత్తా ఏంటో చాటింది. గాలి, నీరు, నేల, అంతరిక్షం ఇలా ఎక్కడైనా దూసుకెళ్తాం.. ఎవరినైనా ఢీకొడతాం అన్నట్లుగా మిలటరీ పరేడ్ సాగింది.. చైనా దగ్గర ఇన్ని రకాల డిఫెన్స్ ఎక్విప్ మెంట్ ఉందా? అని చాలా దేశాలు అనుకున్నాయ్. 1950 తర్వాత ఆధునిక కాలంలో చైనా ఒక్క పెద్ద యుద్ధం కూడా చేయలేదు. కానీ ఇవన్నిటినీ ఒక్కొక్కటిగా పోగేసుకుంది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయినందుకు గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 26 దేశాధినేతలు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. షాబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ కూడా ఈ పరేడ్ కు వెళ్లారు. చైనీస్ వెపన్ సిస్టమ్స్ లో ఇన్ని వెరైటీలు ఉన్నాయా? అని లెక్కపెట్టేందుకు కూడా టైం సరిపోదు. అంతలా డ్రాగన్ చైనా డిఫెన్స్ ఎక్విప్ మెంట్స్ ను పోగేసుకుంది.
AI డ్రోన్‌లు, ఆటోమేటెడ్ వార్ హెడ్స్ ప్రదర్శన
ఈ పరేడ్‌లో AI ఆధారిత డ్రోన్‌లు, ఆటోమేటెడ్ వార్ హెడ్స్ ను చైనా ప్రదర్శించింది. ఇవి చైనా సైనిక ఆధునీకరణలో కొత్త శకానికి దారి తీసింది. చైనా మొదటిసారిగా తన న్యూక్లియర్ ట్రయాడ్ ను పూర్తిగా ప్రదర్శించింది. అంటే గాలి, నీరు, నేల ఇలా ఎక్కడి నుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే వాటిని డిస్ ప్లే చేసింది. ఇందులో ఎయిర్ బేస్డ్ లాంగ్ రేంజ్ మిసైల్ JL-1 ఉంది. సముద్రం నుంచి ప్రయోగించే JL-3 ఉంది. ఇక DF-61, DF 31 భూమ్మీద నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణి అణ్వాయుధాలు. 7,500 మైళ్ల రేంజ్‌తో వాషింగ్టన్‌ను ఇది టార్గెట్ చేసే వీలుంది. DF-5C అణు క్షిపణి. దీనికి 13 వేల కిలోమీటర్ల రేంజ్ ఉంది. ఇది హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 200 రెట్లు పవర్ ఫుల్. పెరేడ్‌లో ఇంకా YJ-15, YJ-17, YJ-19, YJ-20 హైపర్‌సోనిక్ యాంటీ-షిప్ క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇవి అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను లక్ష్యంగా చేసుకునేవి అంటున్నారు. ఈ క్షిపణులను చైనా క్యారియర్ కిల్లర్స్ గా పిలుస్తుంది. ఎందుకంటే ఇవి అమెరికన్ నేవీ యాంటీ-మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తాయంటున్నారు. ఇక ఈ నాలుగు కాళ్ల రోబోట్‌లు టైంపాస్ వి కావు. 70 కిలోల బరువుండే ఈ రోబో డాగ్ లు శత్రు స్థావరాల దగ్గరికి వెళ్లడం, రియల్-టైమ్ ఫుటేజ్ అందించడం, కష్టమైన భూభాగాల్లోకి సామగ్రిని తీసుకెళ్లడం, ఎటాక్స్ చేయడం వంటి స్పెషాలిటీస్ ఉన్నాయి.
7,500 మైళ్ల రేంజ్‌తో వాషింగ్టన్ టార్గెట్
ఇక పరేడ్ లో ప్రదర్శించిన వాటిలో అండర్‌వాటర్ డ్రోన్‌లు ఉన్నాయి. AJX002. ఇది 18-20 మీటర్ల పొడవైన, టార్పెడో ఆకారంలో ఉన్న అండర్‌వాటర్ డ్రోన్. సముద్ర యుద్ధాల్లో వాడకానికి తయారు చేశారు. ఇది స్టెల్త్ ఆపరేషన్‌లకు లాంగ్ టర్మ్ పెట్రోలింగ్‌కు ఉపయోగపడుతుంది. షిప్‌ల నుంచి లాంచ్ చేయగల అన్‌మ్యాన్డ్ హెలికాప్టర్లనూ ప్రదర్శించారు. GJ-11 డ్రోన్ అన్‌మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ కూడా ఉంది. పరేడ్ లో సైబర్‌స్పేస్ యూనిట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సైబర్ వార్ ఫేర్ లో చైనా దూరదృష్టికి ఈ వింగ్ నిదర్శనం. ఇక డ్రోన్ దాడులను తిప్పికొట్టడానికి యాంటీ-డ్రోన్ లేజర్ వెపన్స్ ను పరేడ్ లో తొలిసారి బాహ్య ప్రపంచానికి చాటింది. ఇక కీలకమైంది HQ-29 స్పేస్ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ తక్కువ భూ కక్ష్యలో ఉన్న శాటిలైట్‌లను టార్గెట్ చేసుకుంటుంది. అంటే స్పేస్ వార్ లోనూ చైనా పవర్ పెరిగిందని ప్రపంచానికి చాటింది. ఇక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్‌లతో ఆకాశంలో విన్యాసాలు చేయించారు. ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ కు చెక్ పెట్టేందుకే.
అమెరికాను సవాల్ చేసేలా చైనా ఆయుధ సంపత్తి పెంచుకుంది. అంతా లేటెస్ట్ వెపన్ సిస్టమే. ఇటీవలి కాలంలో ఒక్క యుద్ధం చేయకపోయినా అడ్వాన్స్ డ్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ అందిపుచ్చుకుంది. అమెరికాకు సవాల్ విసురుతోంది. ఈ డ్రాగన్ మిలటరీ పరేడ్ చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా, రష్యా, నార్త్ కొరియా కలిసి USకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇంతకీ డిఫెన్స్ సెక్టార్ లో అమెరికాను చైనా దాటిపోయిందా? అదే ట్రంప్ భయమా?
దేశీయంగా కెపాసిటీ పెంచుకున్న చైనా
భవిష్యత్ యుద్ధ తంత్రాలంతా ఆటోమేటెడ్ అలాగే డిజిటల్‌గా మారుతున్నాయనడానికి చైనా మిలటరీ పరేడ్ నిదర్శనం. ఒకప్పుడు లక్షల సంఖ్యలో సైనికులు అవసరం. కానీ ఇప్పుడు సైనికులు తక్కువున్నా టెక్నాలజీతో దెబ్బకొట్టే మిలటరీ ఎక్విప్ మెంట్ అవసరం. ఈ పెరేడ్ తో చైనా తన లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించింది. గతంలో చైనీస్ వెపన్స్ అమెరికన్ లేదంటే రష్యన్ టెక్నాలజీ కాపీ ఆధారంగా ఉండేవి. కానీ ఇప్పుడు చైనా దేశీయంగా కెపాసిటీలను పెంచుకుంది. అయితే ఈ కొత్త ఆయుధాలు యుద్ధాల్లో ప్రూవ్ కాలేదు. ఎందుకంటే చైనా ఆధునిక యుగంలో ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఈ ఆయుధాలు ఎలా పని చేస్తాయో ఎవరికీ తెలియదు. పైగా అమెరికన్ ఎక్స్ పర్ట్స్ ఇవన్నీ పేపర్ వెపన్సే అంటున్నారు. తమ బీ 2 బాంబర్ ఒక్కటి చాలు అంటున్నారు.
ఆయుద మార్కెట్ పెంచుకునే వ్యూహంలో డ్రాగన్
జిన్‌పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపై కలిసి కనిపించడం ఈ మూడు దేశాల మధ్య బలమైన రాజకీయ కూటమిగా మారింది. ఇది పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఒక హెచ్చరికగా మారింది. ఎందుకంటే తైవాన్ స్ట్రెయిట్, అలాగే సౌత్ చైనా సీ లో అమెరికాకు చెక్ పెట్టే కెపాసిటీతో ఉన్నాయి. గతంలో జపాన్ చేసిన దురాక్రమణలపై జిన్ పింగ్ మాట్లాడడం కూడా ఆసియా పసిఫిక్ లో ఫ్యూచర్ లో ఉద్రిక్తతలు పెంచడానికి దారి తీయొచ్చు. ఈ పరేడ్ తో చైనా తన ఆయుధాలను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. మయన్మార్ వంటి దేశాలు ఇప్పటికే చైనా నుంచి ఆయుధాలను భారీగా కొనుగోలు చేస్తున్నాయి.
చైనా దగ్గర 20.18 లక్షల సైనికులు
చైనా మిలటరీ పరేడ్ ను చూసిన ట్రంప్ కామెంట్ చేయకుండా ఊరుకుంటారా? చైనా, రష్యా, నార్త్ కొరియా కలిసి USకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కుట్రలు చేస్తే ట్రంప్ భయపడుతారా? అది తెలియాలంటే.. అమెరికా, చైనా ఆయుధ సంపత్తి ఏంటో తెలుసుకోవాలి. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో అమెరికా, చైనా దగ్గర ఎంత ఆయుధ బలగం ఉందో చెప్పింది. చైనా దగ్గర 20 లక్షల 18 వేల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. అలాగే 10 లక్షల 15 వేల మంది రిజర్వ్ సైనికులున్నారు. అటు అమెరికా దగ్గర 10 లక్షల 39 వేల యాక్టివ్ ఆర్మీ, 8,45,000 రిజర్వ్ సైనికులు ఉన్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ విషయం చూస్తే.. చైనా దగ్గర 3,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఇందులో 1,200 ఫైటర్ జెట్‌లు, 400 బాంబర్‌లు, 400 డ్రోన్‌లు ఉండగా, అమెరికా దగ్గర 13,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. అందులో 1,800 ఫైటర్ జెట్‌లు, 600 బాంబర్‌లు 2 వేల డ్రోన్‌లతో ఆధిపత్యంతో ఉంది. ఇక నేవల్ కెపాసిటీ చూస్తే చైనా దగ్గర 370 వార్ షిప్స్ ఉన్నాయి. ఇందులో 3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 50 డిస్ట్రాయర్‌లు, 70 సబ్‌మెరైన్‌లతో చైనా ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళంగా ఉంది. అటు అమెరికా దగ్గర 290 నేవీ వార్ షిప్స్ ఉన్నాయి. ఇందులో 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 70 సబ్‌మెరైన్‌లు, 90 డిస్ట్రాయర్‌లున్నాయి.
చైనా దగ్గర 600 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు
కీలకమైన అణ్వాయుధాల విషయంలో చైనా దగ్గర 600 వార్‌హెడ్‌లు ఉన్నాయి. 2035 నాటికి 1,500కి విస్తరణ టార్గెట్ గా పెట్టుకున్నారు. అమెరికా దగ్గర 5,044 వార్‌హెడ్‌లు ఉన్నాయి. అయితే USతో పోలిస్తే చైనా దగ్గర అణ్వాయుధాలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా దగ్గర ఉన్న వాటికంటే పవర్ ఫుల్. చైనా క్షిపణుల్లో DF-41, DF-31, JL-3 వంటి ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, YJ సిరీస్ హైపర్‌సోనిక్ క్షిపణులున్నాయి. అమెరికా దగ్గర AGM-183A ARRW, HAWC హైపర్‌సోనిక్ మిసైల్స్, టామ్‌హాక్ క్రూయిజ్ క్షిపణులున్నాయి. ఇక సైబర్ స్పేస్ విషయంలో చైనా దగ్గర HQ-29 స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే సమయంలో అమెరికాకు US సైబర్ కమాండ్ స్పేస్ ఫోర్స్, యాంటీ-శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి.
Also Read: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్
చైనాకు రోబో వోల్వ్స్ స్పెషల్ అట్రాక్షన్
రోబోటిక్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ లో చైనాకు రోబోట్ వోల్వ్స్ ఉన్నాయి. GJ-11 డ్రోన్‌లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో సత్తా పెంచుకుంటుండగా.. అమెరికా దగ్గర MQ-9 రీపర్, RQ-4 గ్లోబల్ హాక్, XQ-58A డ్రోన్‌లు ఉన్నాయి. సో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. అయితే అమెరికా చైనా డిఫెన్స్ ఎక్విప్ మెంట్స్, వార్ స్ట్రాటజీల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అమెరికన్ ఫైటర్ జెట్‌లు F-22, F-35 లాంటివి యుద్ధాల్లో పరీక్షించారు. సాంకేతికంగా అడ్వాన్స్డ్. అయితే చైనా J-20, రోబోట్ డాగ్స్ కొత్త ఆవిష్కరణలు. వీటిని యుద్ధాల్లో పరీక్షించలేదు. చైనా హైపర్‌సోనిక్ క్షిపణుల్లో ముందంజలో ఉంది. అయితే అమెరికా వేగంగా ఆ గ్యాప్‌ను తగ్గించుకుంటోంది. అటు అమెరికా 750కి పైగా విదేశీ సైనిక స్థావరాలను కలిగి ఉంది. ఇది అమెరికాకు యుద్ధాల విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. చైనాకు కేవలం 3-4 విదేశీ స్థావరాలే ఉన్నాయి. అంటే ఏ యుద్ధం చేసినా చైనా నుంచే చేయాలి. 2024 చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ ప్రకారం, చైనా సైనిక శక్తి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా నేవీ, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో అమెరికాను మించిపోయింది. అందుకే ట్రంప్ జాగ్రత్త పడుతున్నారు. చైనాకు రష్యా, నార్త్ కొరియా తోడైతే తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంలో అమెరికా ఉంది. అందుకే ఈ ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Story By Vidya Sagar, Bigtv