China Space Project : అంతరిక్ష పరిశోధనల్లో చైనా కీలక ప్రాజెక్టును చేపట్టింది. అతిపెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని “చాంగ్ ఈ-7” మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ ప్రత్యేకంగా చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటిని జాడను కనుగొనడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. కాగా.. ఈ ప్రాజెక్టుపై అంతర్జాతీయంగా అనేక మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే.. చాంగ్ ఈ-7లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
చంద్రుడు దక్షిణ ధృవంపై సూర్య కిరణాలు అస్సలు పడవు. ఈ ప్రదేశాల్ని ప్రర్మనెంట్ షాడో రీజియన్స్ (Permanently Shadowed Regions – PSRs) గా పిలుస్తుంటారు.
ఇక్కడ నీరు.. మందు రూపంలో(Ice Deposits) ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల నమ్మకం. అందుకే.. ఈ ప్రాంతంపై పరిశోధనలకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడి నీటి గుట్టును కనిపెడితే.. భవిష్యత్ లో మానవ సహిత అంతరిక్ష యాత్రల సమయంలో, అక్కడ మానవ నివాసాల్ని ఏర్పాటు చేసుకునే సమయంలో ఉపయోగపడాతాయని భావిస్తున్నారు.
అత్యాధునిక రోబో.. రహస్యాల గుట్టు చేధిస్తుంది
చైనా ప్రయోగిస్తున్న “చాంగ్ ఈ-7” మిషన్ లో చైనా ఒక ఆధునిక రోబోట్‌ను ఉపయోగిస్తోంది, ఇది సాధారణ రోవర్లతో పోల్చితే అత్యాధునికంగా, విస్తృతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ రోబోట్ ప్రత్యేకమైన రాకెట్ ప్రెపల్షన్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇది ఓ ప్లైయింగ్ రోబోట్ అని తెలుపుతున్నారు. అంటే.. పరిశోధనల్లో భాగంగా.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు.. గాల్లోకి ఎగరడం, దూరానికి దూకడం.. చేస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు పంపిన రోవర్లు.. చక్రాల సాయంతో చంద్రుడిపై నడుస్తూ.. అక్కడ పరిశోధనలు చేశాయి. కానీ.. ఈ ప్లైయింగ్ రోబో వల్ల మరింత ఎక్కువ పరిశోధనలు చెయ్యొచ్చని చైనా భావిస్తోంది. దీనివల్ల అది చంద్రుడి ఉపరితలంపై ఇప్పటి వరకు చేరుకోలేని ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చని అంటున్నారు. ఈ రోబోట్ గాల్లో ప్రయాణిస్తూ.. కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని తెలస్తోంది. అదే నిజమైతే.. చంద్రుడి ఉపరితలంపైన ఉండే కఠినమైన పర్వాత, లోయ ప్రాంతాలను సులువుగా జల్లెడ పట్టొచ్చు. అలాగే.. అనేక శాశ్వత అంధకార ప్రాంతాలలో నీటి మంచు జాడ కోసం ప్రయత్నించేందుకు దోహదపడుతుంది.
ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీతో రూపుదిద్దిన రోబోట్. దీని ఆరు కాళ్లు, నావిగేషన్ వ్యవస్థలు, శాస్త్రీయ పరికరాలు అమర్చి ఉంటాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వెల్లడించింది. ఈ రోబోట్.. సూర్యశక్తి, ఇంధనంతో పనిచేస్తుందని… ఈ రోబోట్ చంద్రుని వాతావరణాన్ని విశ్లేషించి, కొత్త విషయాలను తెలియజేస్తుందని అంటున్నారు. ఈ మిషన్ ద్వారా మరో భవిష్యత్ ప్రాజెక్టును సైతం సాకారం చేసుకోవాలని చూస్తుంది. రానున్న రోజుల్లో చంద్రునిపై శాశ్వత పరిశోధనా కేంద్రం స్థాపించాలని చైనా భావిస్తోంది. అందుకు ఈ ప్రాజక్టు ఉపయోగపడుతుందని అంటున్నారు.
Also Read :
ఈ “చాంగ్ ఈ-7” మిషన్ 2030 నాటికి మానవ సహిత ప్రయాణాలు ప్రారంభించడానికి చైనా లక్ష్యంగా పెట్టుకున్న దిశలో కీలక అడుగుగా భావిస్తున్నారు. చంద్రునిపై శాశ్వతమైన కేంద్రం ఏర్పాటులో సహాయపడే ఈ మిషన్, భవిష్యత్తులో అంతరిక్ష అన్వేషణకు కొత్త మార్గాలను తెరిచే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. చాంగ్ ఈ-7 మిషన్ విజయవంతమైతే, చంద్రుని దక్షిణ ధ్రువంపై మరింత లోతైన అవగాహన ఏర్పడే అవకాశముంది.