Billionaire in 24 Hours: ఓ యువకుడు ఒక్క ఆలోచనతో లెక్కలేనంత డబ్బు సంపాదించాడు. ఆ డబ్బు లెక్కపెట్టేందుకు రోజులు సరిపోవు. అంతటి డబ్బు సంపాదించేందుకు ఏదో ఏళ్ల తరబడి కష్టపడ్డాడని అనుకుంటే పొరపాటే.. జస్ట్ 24 గంటల్లో మొత్తం కూడబెట్టుకున్నాడు. ఇదేందిరా అయ్యా.. ఇంత డబ్బులు సంపాదించావంటే, నీది మామూలు మైండ్ కాదు.. నువ్వు సామాన్యుడివి కాదు అంటూ అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో మనోడి టాలెంట్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇంతకు ఇతను ఎవరు? ఎక్కడ జరిగింది? ఎంత సంపాదించాడు? అసలు ఏం చేశాడో తెలుసుకుందాం. అసలు అతనికి వచ్చిన ఆ ఐడియా ఏమిటో తెలుసుకున్న తర్వాత మీరు సైతం వావ్ అనేస్తారు. మరెందుకు ఆలస్యం.. ఇక అసలు విషయంలోకి వెళితే..
ఒక్క ఐడియా కాదు బాక్స్ తో లైఫ్ ఛేంజ్..
ఏ బొమ్మ వస్తుందో తెలియని ఓ చిన్న పెట్టె, కానీ అందులో దాగి ఉంది అతని అద్భుత విజయం. చైనాకు చెందిన యువకుడు వాంగ్ నింగ్, 2010లో ప్రారంభించిన పాప్ మార్ట్ కంపెనీతో ఒక్క ఆశ్చర్యకరమైన కాన్సెప్ట్ మొదలు పెట్టాడు. దీనితో ప్రపంచాన్ని షేక్ చేశాడని చెప్పవచ్చు. ఆ కాన్సెప్ట్ ఏదో అనుకోవద్దు.. బ్లైండ్ బాక్స్ లో బొమ్మలు. ఇదే ఇప్పుడు ఇతడిని బిలియనీర్‌ల జాబితాలోకి చేర్చింది.
అమ్మో బొమ్మ కాదు.. ఇది అమ్మే బొమ్మ
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఓ చిన్న బొమ్మ హడావుడి రేపుతోంది. పెద్దగా హానిచేయని రూపంతో, చిన్న పిల్లల ఆటబొమ్మలా కనిపించే ఈ బొమ్మ ఇప్పుడు సెలబ్రిటీ బ్యాగుల్లో కనిపిస్తోంది. షాపింగ్ మాల్స్‌లో అసలు దొరకటం లేదు. దీంట్లో హైలైట్ ఏంటంటే ఇది ఓ బ్లైండ్ బాక్స్ గా అమ్మే బొమ్మ. దీని పేరు లబుబు (Labubu). దీన్ని తయారు చేసిన సంస్థ పేరు పాప్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ అయితే దీని CEO పేరే వాంగ్ నింగ్. ప్రస్తుతం ఇతని వ్యాపార సామ్రాజ్యం ప్రపంచ మార్కెట్లను ఊపేస్తోంది.
బిలియనీర్ ఐడియా ఇదే..
పాప్ మార్ట్ రూపొందించిన లబుబు బొమ్మలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఇవి సాధారణ బొమ్మల్లా కాకుండా, కొంచెం గ్రెమ్లిన్‌లా కనిపించే ముఖాకృతి, కొంటె చిరునవ్వుతో పిల్లలను మాత్రమే కాక, పెద్దల దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ బొమ్మలు బ్లాక్‌పింక్ స్టార్ లిసా, రిహానా, అనన్య పాండే, సింగపూర్ జామీ చువా వంటి స్టార్ల లగ్జరీ బ్యాగుల్లో వేలాడుతున్నాయి. ఈ ఫోటోలు వైరల్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఎలా బిలీయనీర్ అయ్యాడంటే?
పాప్ మార్ట్ వ్యాపార విజయ రహస్యమేంటంటే బ్లైండ్ బాక్స్ స్ట్రాటజీ. వినియోగదారులకు ఏ బొమ్మ వస్తుందో తెలియని విధంగా బాక్స్ సీల్ చేసి అమ్ముతారు. ఇదే ఆశ్చర్యకరమైన అనుభూతిని, ఆసక్తిని కలిగిస్తుంది. ఒకసారి కొనడం మొదలుపెడితే, ఇంకా కొనుగోలు చేయాలన్న ఉత్సాహంతో వినియోగదారులు తిరిగి తిరిగి కొనుగోలు చేస్తుంటారు. ఈ వినూత్న వ్యూహమే పాప్ మార్ట్‌ను టాయ్ మార్కెట్లో అంతులేని స్థాయికి తీసుకెళ్లింది.
ఒక్క రోజులో కోట్లు కొల్లగొట్టాడు
2025 ఏప్రిల్‌లో విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, వాంగ్ నింగ్ ఒక్క రోజులోనే తన సంపదకు $1.6 బిలియన్లు జోడించగలిగాడు. అంటే ఒక్కరోజులో మన ఇండియన్ కరెన్సీలో చెబితే అక్షరాలా సుమారు రూ. 13,280 కోట్లు. షాకయ్యారా.. ఆప్పుడే ఏమైంది.. ఇంకా అసలు విషయం ఏమిటంటే.. దీనికి ప్రధాన కారణం పాప్ మార్ట్ యాప్ USలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయడమే.
అమెరికాలో పాపులారిటీ పెరగడంతో పాటు, అక్కడ స్టోర్ల ముందు గంటల తరబడి వినియోగదారులు క్యూలో నిలబడి మరీ కనిపించారు. బ్రిటన్‌లో ఈ క్రేజ్ మరింతగా ఊపందుకోవడంతో, కొన్ని స్టోర్లలో అల్లర్లకు దారి తీసిందట. దాంతో అక్కడి స్టోర్లు ఈ బొమ్మల విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేశారని తెలుస్తోంది.
Also Read: GT VS MI, Eliminator: గుజరాత్ ఓటమి.. పంజాబ్ తో ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్
ఇతని మైండ్ హిస్టరీ తెలుసుకుంటే.. ఓయమ్మో.. ఓలమ్మో అనేస్తారు
వాస్తవానికి వాంగ్ నింగ్ అసలు కథ కూడా ఎంతో ప్రేరణాత్మకం. 1987లో చైనా హెనాన్ ప్రావిన్స్‌లో జన్మించిన వాంగ్, 2009లో జెంగ్‌జౌ విశ్వవిద్యాలయం నుండి ప్రకటనలలో డిగ్రీ పూర్తిచేశాడు. తరువాత 2010లో పాప్ మార్ట్‌ను ప్రారంభించాడు. తొలి దశలో చిన్న బొమ్మల అమ్మకాలు చేసిన వాంగ్, బ్లైండ్ బాక్స్ కాన్సెప్ట్‌ద్వారా మార్కెట్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాడు. కంపెనీ 2020లో హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో పబ్లిక్ అయింది. అప్పటి నుంచి ఈ సంస్థ లాభాల పరంగా అమాంతంగా పెరుగుతూ వచ్చింది.
ప్రస్తుతం వాంగ్ నింగ్ యొక్క ఆస్తి $18.7 బిలియన్లు. అంటే మన కరెన్సీలో రూ.15 లక్షల 52 వేల కోట్లు. దీనితో ఇతడు చైనా అత్యంత ధనిక యువ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచాడు. వాణిజ్యంగా చైనా – అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నా కూడా, లబుబు బొమ్మల క్రేజ్ అమెరికాలో ఏమాత్రం తగ్గలేదు. ఇది పాప్ మార్ట్ బ్రాండ్‌కు అంతర్జాతీయంగా ఉన్న ఆకర్షణకు నిదర్శనం.
ఈ బొమ్మలు కేవలం పిల్లల ఆటబొమ్మలుగా కాకుండా, ఒక లైఫ్‌స్టైల్ స్టేట్మెంట్‌గా మారుతున్నాయి. సేకరణల మోజు, సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు, సెలబ్రిటీల వినియోగం ఇవన్నీ కలిపి లబుబు బొమ్మలను ఈ సీజన్ హాటెస్ట్ యాక్సెసరీగా నిలిపాయి. మొత్తంగా చెప్పాలంటే, చిన్న బొమ్మల ప్రపంచంలో పాప్ మార్ట్ తీసుకువచ్చిన మార్పు గొప్పదే. ఒక చైనీస్ యువకుడి కల ప్రపంచాన్ని గెలుచుకుంది.
లబుబు ఇప్పుడు ఓ బొమ్మ కాదు, అది ఓ క్రేజ్. ఇది బిజినెస్‌లో కొత్తగా ఆలోచించాలనుకునే యువతకు గొప్ప ప్రేరణ. మొత్తం మనోడు కేవలం ఒక్క ఐడియాతో 24 గంటల్లో కోట్లు కొల్లగొట్టాడని చెప్పడం కంటే, అతనిపై డబ్బుల తుఫాన్ కురిసిందని చెప్పవచ్చు. ఇందుకే అంటారేమో ఒక్క ఐడియా.. లైఫ్ ను ఛేంజ్ చేస్తుందని.. మీరు బిజినెస్ మ్యాన్ అయితే మీరు ట్రై చేయండి!