Donald Trump- Elon Musk: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత మస్క్ పెట్టిన ఎక్స్ పోస్ట్‌లోనే ఒక హింట్ ఇచ్చారు. వైట్ హౌస్ బ్యాక్ గ్రౌండ్‌లో ఒక కిచెన్ సింక్‌ని మోసుకెళ్తున్న పిక్చర్‌ని పోస్ట్ చేశారు. దాని క్యాప్షన్ “లెట్ దట్ సింక్ ఇన్”. ఈ మాటతో ఫెడరల్ ప్రభుత్వంలోని అధికారులంతా జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని చెమటలు తుడుచుకోవాల్సొచ్చింది. అంటే, ట్రంప్ ప్రభుత్వంతో ప్రైవేట్ వ్యాపారులు ఎంతగా సింక్ అవుతారో అర్థమయ్యింది. ముఖ్యంగా, మస్క్ ఎంట్రీ ఒక్క ఆర్థిక వ్యవహారాల్లోనే కాదు ఏకంగా అమెరికా భద్రతకే ముప్పు తెస్తుందనే సందేహాలు కలుగుతున్నాయ్.
చైనాలోని షాంఘైలో టెస్లా అతిపెద్ద కర్మాగారం
అమెరికా ప్రభుత్వంలోకి మస్క్ రావడం ఫెడరల్ ప్రభుత్వంలోని అధికారులకే కాదు.. ప్రభుత్వ అధినేత ప్రెసిడెంట్ ట్రంప్‌కు కూడా ప్రమాదమేనని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే, మస్క్ వ్యాపార ప్రయోజనాలు అమెరికా విదేశాంగ విధానంతో క్లాష్ అయ్యి, కారుచిచ్చులా మారుతుందని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఉదాహరణకి.. టెస్లాకు చెందిన అతిపెద్ద కర్మాగారం చైనాలోని షాంఘైలో ఉంది. మరొకటి జర్మనీలోని బెర్లిన్‌లో ఉంది. అయితే, ట్రంప్ హయాంలో చైనా, జర్మనీ రెండూ అధిక టారిఫ్ అడ్డంకులను ఎదుర్కుంటున్నాయి.
దీనికి తోడు, మస్క్ పుతిన్‌తో రహస్య వ్యవహారాలు నడుపుతున్నారనే డౌట్‌లు గత కొంతకాలంగా కొనసాగుతున్నయి. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో స్టార్‌లింక్ సేవలకు పరిమితులు విధించడం ఇందులో భాగమని ఇది వరకే విమర్శలు వచ్చాయి. అలాగే, స్టార్‌లింక్‌ను తైవాన్ వాడకుండా చేయడానికి మస్క్ మిత్రుడైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తరపున మస్క్(Elon Musk) అమెరికాతో లాబీయింగ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే, తైవాన్‌పై అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా మస్క్ పనిచేశాడని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. ఈ ఉదాహరణలో రాబోయే కాలంలో తన వ్యాపార ప్రయోజనాల కోసం మస్క్ అమెరికా విదేశీ విధానాలకు ముప్పు తెస్తాడని కొందరు భావిస్తున్నారు.
$1.8 బిలియన్ల స్పేస్ఎక్స్ ఒప్పందాలు
ఇక, స్టార్‌లింక్ ఉపగ్రహ వ్యవస్థను నిర్వహించే స్పేస్ఎక్స్ విషయానికి వస్తే.. అమెరికా ప్రభుత్వ ఒప్పందాలపై ఈ సంస్థ నుండి చాలా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ కంపెనీ 2021లో యూఎస్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో $1.8 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పొందింది. ఇప్పుడు నాసా, పెంటగాన్‌లకు ఇదే ప్రధాన రాకెట్ లాంచర్. అలాంటిది, మస్క్ తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తే.. అది అమెరికా భద్రతా వ్యవహారాల్లో సమస్యలకు కారణం అవుతుంది.
Also Read: కరిగిపోయిన ట్రంప్ ఆస్తి.. ఒక్కరోజులో 300 మిలియన్ డాలర్లు నష్టం!
దీనికి తోడు, స్టార్‌లింక్, స్పేస్‌ఎక్స్ కోసం, రష్యా, చైనాతో పాటు ఇతర పెద్ద దేశాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెరెస్ట్రియల్ రిలే స్టేషన్‌లకు మస్క్ యాక్సెస్ ఇవ్వడం వల్ల అది అమెరికాకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇక, రష్యా కూడా అంతరిక్షంలో ఉపగ్రహాలను నాశనం చేసే సామర్థ్యాన్ని ఇప్పటికే రెడీ చేసుకుంది. ఒకవేళ, రష్యా దానికి పూనుకుంటే.. మస్క్ ఏ ధరకైనా ఆ ప్రమాదాన్ని నివారించడానికి మస్క్ ఆసక్తి చూపుతాడని, అది అమెరికా సామర్థ్యాన్ని తాకట్టు పెట్టినట్లేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ గ్రీన్ ఇనిషియేటివ్‌ల పట్ల ట్రంప్ వ్యతిరేకత
ఇక, ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని ట్రంప్, మస్క్‌లు కలిసి మరింత కలుషితం చేస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే, ప్రపంచ గ్రీన్ ఇనిషియేటివ్‌ల పట్ల ట్రంప్ వ్యతిరేకత స్పష్టంగా ఉంది. తన మొదటి పాలనా కాలంలో పారిస్ ఒప్పందం నుండి ట్రంప్ బయటకొచ్చేశారు. ఇక, పెట్రోలియం వినియోగంపైన స్థిరమైన విశ్వాసంతో ఉన్న వ్యక్తి ట్రంప్.
ఇది, మస్క్ కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు లాభదాయకంగా లేనప్పటికీ.. రాబోయే రోజుల్లో మస్క్ EVలకు దూరంగా ఉండవచ్చనే అభిప్రాయాల మధ్య పర్యావరణ పరిరక్షకుల్లో ఆందోళన పెరిగింది. మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల బిజినెస్‌ని పక్కన పెట్టి, భవిష్యత్తులో ఎనర్జీకి సంబంధించిన ఇతర వ్యాపారాలపై దృష్టి పెడతారనీ.. తన స్పేస్ ఎక్స్ ప్రయోగాలకు అనుగుణంగా ఈ వ్యాపారం అభివృద్ధి చేస్తారనే టాక్ నడుస్తోంది. అరడజను ఫ్యూచరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ స్థాపకుడిగా మస్క్ ప్రయోజనాలకు తగినట్లే ట్రంప్ ప్రభుత్వం నడుస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
అక్టోబర్ 26న వాషింగ్టన్ పోస్ట్ విడుదల చేసిన ఒక నివేదిక
అయితే, ట్రంప్(Donald Trump) కూడా తన విధానానికి విరుద్ధంగానే మస్క్‌ను చేరదీస్తున్నారనే విమర్శ కూడా లేకపోలేదు. ట్రంప్ గెలుపులో కీలకమైన అక్రమ వలసలు విషయానికే వస్తే.. అక్టోబర్ 26న వాషింగ్టన్ పోస్ట్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌కు అతిపెద్ద దాతగా ఉన్న ఎలన్ మస్క్ తన మొదటి కంపెనీని ప్రారంభించినప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో చట్టవిరుద్ధంగానే పనిచేశాడనే విషయం బయటకొచ్చింది.
దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ తన కంపెనీ కోసం పని చేస్తున్నప్పుడు చట్టపరమైన అనుమతి లేదనీ.. తర్వాతి రోజుల్లో మస్క్, అమెరికాలో అత్యంత విజయవంతమైన వలసదారుగా మారారంటూ.. ఆ నివేదిక పేర్కొంది. నిజానికి, అమెరికా ప్రభుత్వంలో మస్క్ ఎంట్రీ ట్రంప్‌కి కూడా ప్రమాదకరంగానే పరిణమిస్తుందని అంతర్జాతీయంగా చర్చలు చేస్తున్నారు. కొన్ని వ్యవహారాల్లో ట్రంప్ ప్రకటించిన విధానాలకు మస్క్ విరుద్ధంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మరి ట్రంప్, మస్క్ కాంభినేషన్‌లో అమెరికా ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది చూడాలి.