Trump Net Worth Dip| అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తి విలువ భారీ క్షీణించింది. అదేంటి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆస్తి పెరగాలి కానీ? తగ్గిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇదే నిజం. దీనికి కారణం ఆయన సోషల్ మీడియా కంపెనీ ట్రూత్ సోషల్ షేర్లు భారీగా పతనం కావడం. నవంబర్ 12న కంపెనీ షేర్ల విలువ ఏకంగా 8 శాతం క్షీణించిందని సమాచారం. ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించగానే ఆయనకు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ షేర్లు అమాతం పెరిగిపోయాయి.
అయితే ఫోర్బ్స్ బిజినెస్ పత్రిక కథనం ప్రకారం అలా అనూహ్యంగా పెరిగిపోయిన షేర్ వ్యాల్యూ.. గత కొన్ని రోజులుగా కంపెనీ షేర్ల విలువ క్రమంగా తగ్గుతూ వచ్చింది. నవంబర్ 12, అమెరికా సమయం 2.40 గంటలకు స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ మీడియా కంపెనీల షేర్ ధర 31 డాలర్ల దిగువకు పడిపోయింది. అంతకుముందు నవంబర్ 11 అదే షేర్ విలువ 33.41 డాలర్లుగా ఉండేది. ఎన్నికల ఫలితాలు రాగానే ట్రంప్ తదుపరి అధ్యక్షుడు తేలిపోయింది. దీంతో ఈ కంపెనీ షేర్లు రెండు రోజుల పాటు పెరిగి 20.6 శాతం వృద్ధిని సాధించాయి. కానీ ఇప్పుడు కంపెనీ షేర్లు పతనం కావడంతో ట్రంప్ నకు భారీ నష్టం వాటిల్లింది.
Also Read: గూగుల్‌కు భారీ జరిమానా విధించిన రష్యా .. 20 డెసిలియన్ డాలర్లు.. అంటే 2 తరువాత 34 జీరోలు!
ట్రూత్ సోషల్ కంపెనీ మాతృ సంస్థ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ లో ట్రంప్ వాటా 57 శాతం ఉంది. అంటే కంపెనీలో ఆయన మొత్తం 114.75 మిలియన్ షేర్లు ఆయనకు చెందినవి. కంపెనీలో ట్రంప్ నకు చెందిన షేర్ల విలువ నవంబర్ 11 వరకు 3.8 బిలియన్ డాలర్లు ఉండగా.. నవంబర్ 12 సాయంత్రానికి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించింది. అయితే నవంబర్ 6న ట్రంప్ విజయంతో ఇదే కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. నవంబర్ 6న ఒక్క షేర్ విలువ 45.77 డాలర్లుగా రికార్డ్ స్థాయికి చేరింది. అప్పుడు ట్రంప్ వాటా 5.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
కంపెనీ షేర్ విలువ గత అయిదు రోజులుగా క్షీణిస్తూ ఉండడంతో ట్రంప్ తన వాటాని విక్రయించేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే వెంటనే ట్రంప్ ఇది తప్పుడు ప్రచారమని స్పందించారు. తాను ఎప్పటికీ కంపెనీలో తన వాటాని విక్రయించేది లేదని ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశాడు.
ఫోర్బ్స్ సర్వే ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ 591వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తుల విలువ 5.6 బిలియన్ డాలర్లు. అయితే అక్టోబర్ నెలలో ఆయన కంపెనీల షేర్ విలువ భారీగా పెరిగిపోవడంతో ట్రంప్ నికర ఆస్తి విలువ 8 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది.
ఒకవైపు ట్రంప్.. కంపెనీలో తన వాటాను విక్రయించడం లేదని చెబుతున్నా.. మరోవైపు ఆయన సన్నిహితులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ లందరూ షేర్లు అమ్మకానికి పెట్టడం గమనార్హం. స్వయంగా ట్రంప్ మీడియా గ్రూప్ కంపెనీ సిఎఫ్‌ఓ కూడా కొన్ని రోజుల క్రితమే తన వాటా షేర్లు విక్రయించేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ లో ఫైలింగ్ కూడా చేశానని తెలిపారు.
ఫోర్బస్ పత్రిక కథనం ప్రకారం.. మార్చి 2024లో పబ్లిక్ లిస్టింగ్ అయిన ట్రంప్ మీడియా కంపెనీ ఈ త్రైమాసికంలో 19 మిలియన్ డాలర్ల నష్టాలను చవిచూసింది. ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం, కంపెనీ బిజినెస్ సరిగా లేకపోవడంతో కంపెనీ షేర్ల విలువ ఒకసారి అమాంతం పెరిగిపోతే.. మరోసారి పతనమవుతోంది. ముఖ్యంగా జూలైలో ప్రెసిడెంట్ జో బైడెన్ తో ట్రంప్ డిబేట్ తరువాత, ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తరువాత కంపెనీ షేర్ విలువ భారీగా పెరిగింది. కానీ సెప్టెంబర్ నెలలో కమలా హ్యారిస్ తో డిబేట్ తరువాత కంపెనీ షేర్ విలువ క్షీణించింది.