Wayanad Voter Turnout | బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికలలో భాగంగా కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో కూడా ఓటింగ్ జరిగింది. అయితే సాయంత్రం ఓటింగ్ అంతా పూర్తి అయిన తరువాత కేవలం 64.72 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2009లో వయనాడ్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇదే అత్యల్ప పోలింగ్ కావడం విశేషం.
2024 జూన్ లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 3,64,422 ఓట్ల భారీ మార్జిన్ తో గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో రాహుల్ రెండు చోట్ల నుంచి ఎన్నికల బరిలో దిగారు. వయనాడ్ తో పాటు రాయ్ బరేలీ లోక్ సభ సీటుపై కూడా పోటీ చేశారు. రాయ్ బరేలీలో కూడా రాహుల్ గాంధీ 3,89,341 ఓట్ల భారీ మార్జిన్ తో విజయం సాధించారు.
Also Read: అధికారులేమైనా న్యాయమూర్తులా?.. బుల్‌డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు మండిపాటు
రెండు నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించడంతో ఆయన ఒక సీటుని నియమాల ప్రకారం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన స్థానంలో వయనాడ్ నుంచి కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పోటీ చేశారు. వయనాడ్ తో పాటు బుధవారం కేరళలోని త్రిస్సూర్ లోని చెలక్కరా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరిగాయి. అయితే అక్కడ 72.54 పోలింగ్ శాతం నమోదైనట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్.
వయనాడ్ లో ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకేరీ, బిజేపీ తరపున నవ్య హరిదాస్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీ పక్షాన నిలిచే పరిస్థితులు లేవని అందుకే తక్కువ ఓటింగ్ నమోదు అయిందని సిపిఐ, బిజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. వయనాడ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ 5 లక్షల మెజారిటీ అంటూ నినాదాలిచ్చారు. ఆ నినాదాలను గుర్తు చేస్తూ.. ఆమె పోటీ చేయడంతోనే ఎక్కువ మంది పోలింగ్ బూత్ లకు రాలేదని బిజేపీ నాయకులన్నారు.
కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమి మాత్రం తక్కువ పోలింగ్ నమోదైనా ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతోనే విజేతగా రికార్డు సాధిస్తారని ధీమా వ్యక్తం చేసింది. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన విడి సతీసన్ మాట్లాడుతూ.. సిపిఐ ఎం, కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో జనం ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదని అందుకే తక్కువ పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. దానివల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు.
ఎఐసిసి జెనెరల్ సెక్రటరీలు కెసి వేణుగోపాల్, దీపా దాస్‌మునీ.. ఇద్దరూ ప్రియాంక గాంధీతో వయనాడ్ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో కేరళకు చెందిన ఎమ్మెల్యేలందరూ ప్రచారంలో నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని సమాచారం. ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు కేరళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అందరూ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లుగా మారారు.
వయనాడ్ లో కొన్ని నెలల క్రితం భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి భారీ నష్టం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 231 మంది చనిపోయినట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాలైన ముండాక్కై, చూరల్ మాలా, అట్టామాలా కు సంబంధించిన పోలింగ్ బూత్ లు మేప్పాడి ప్రాంతంలో ఏర్పాటు చేశారు.