BigTV English

Ecuador: ఈక్వెడార్‌పై డ్రగ్ ముఠాల పంజా.. కళ్లెం వేసేదెలా ?

Ecuador: ఈక్వెడార్‌పై డ్రగ్ ముఠాల పంజా.. కళ్లెం వేసేదెలా ?

Ecuador: లాటిన్ అమెరికాలో అత్యధికంగా నేరాలు నమోదవుతున్న మూడో అతిపెద్ద దేశం ఈక్వెడార్. డ్రగ్ ట్రాఫికర్ల దాడులతో ఆ దేశం గత మూడేళ్లుగా విలవిలాడుతోంది. హింస, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌లు, ప్రభుత్వ సంస్థలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. డ్రగ్ గ్యాంగ్‌స్టర్లు ఇద్దరు ఇటీవల జైళ్ల నుంచి తప్పించుకుని పరారయ్యారు. నాటి నుంచీ దేశంలో వరుసగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.


తాజాగా రాజధాని గ్వయకిల్‌లో మంగళవారం చోటు చేసుకున్న టీవీ స్టూడియో ముట్టడి దీనికి కొనసాగింపుగా అనుమానిస్తున్నారు. వ్యవస్థీకృత నేర వ్యవస్థ ఈక్వెడార్‌లో ఎన్నడో వేళ్లూనుకుంది. దీనికి సంబంధించిన భద్రతా నివేదికను బహిర్గతం చేసేందుకు మాజీ అధ్యక్షుడు గియర్మో లాసో(Guillermo Lasso) ప్రయత్నించారు. ఆ నివేదికను వెల్లడిస్తామంటూ ఆయన పదవి నుంచి దిగడానికి రెండు రోజులు ముందే ప్రకటించినా.. ఎందుకో అది ఆచరణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత అధికార మార్పిడి జరిగింది.

వ్యవస్థీకృత నేర వ్యవస్థ సాలెగూడులా ఈక్వెడార్‌లో ఎలా పెనవేసుకుపోయిందో ఆ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ అమెరికాలోనే ఎంతో ప్రశాంతమైన దేశంగా ఒకప్పుడు ఈక్వెడార్‌కు పేరుంది. డ్రగ్స్ ట్రాఫికర్ల ప్రవేశంతో యూరప్ దేశాలకు కొకైన్ సరఫరా చేసే హబ్‌గా రూపాంతరం చెందింది. దేశంలోని 24 ప్రావిన్సుల్లో 21 ప్రావిన్స్‌లలో క్రిమినల్ గ్యాంగ్‌ల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మొత్తం 11 విభిన్నమైన గ్రూపులు నేరాలకు పాల్పడుతున్నట్టు ఆ నివేదిక గుర్తించింది.


ఈక్వెడార్, కొలంబియా, వెనెజువెలా, పెరూ, మెక్సికో దేశాలకు చెందిన క్రిమినల్స్ ఆ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. డ్రగ్ అక్రమ రవాణా రూట్లపై ఆధిపత్యం సాధించడంపైనే వారి దృష్టి అంతా. ఇందుకోసం డ్రగ్స్ ఉత్పత్తి, అక్రమ రవాణా, నిల్వల కోసం ఈక్వెడార్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేశారు. నిరుడు అక్టోబర్ నాటి వరకు గణాంకాలను పరిశీలిస్తే.. డ్రగ్ ముఠాల ఘర్షణల ఫలితంగా 6348 హత్యలు జరిగాయి.

వ్యవస్థీకృత నేరాలు సాగించేందుకు ఆయుధాలు మాత్రమే సరిపోవు.. బోలెడంత డబ్బు కావాలి. డబ్బు సమకూరే మార్గాల్లో కొకైన్‌ ఒకటి. అది ప్రధానంగా ఉత్తర, దక్షిణ సరిహద్దుల గుండా ఈక్వెడార్‌లోకి సరఫరా అవుతోంది. దీనిని అడ్డుకుంటే చాలు.. నేర ముఠాల ఆట కట్టినట్టే. దీంతో డ్రగ్ ట్రాఫికర్లకు డబ్బు చేరకుండా చేయాలని ఈక్వడార్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అయితే ముఠాలు రూటు మార్చి.. సంపాదన కోసం మరికొన్ని మార్గాలను అనుసరించింది. ఆయుధాల విక్రయం, మందుగుండు రవాణా, మైనింగ్, మానవ రవాణా వంటివి ఆ ముఠాలు అక్రమంగా కొనసాగిస్తున్నాయి. బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌లు, చోరీ చేసిన వాహనాలు, సెల్ ఫోన్లు విక్రయాలు వంటి ఆదాయ మార్గాలపై స్థానికంగా ఉండే ముఠాలు ఎక్కువగా ఆధారపడతాయి. వ్యవస్థీకృత నేరాలు, ఇతర నేర కార్యకలాపాల వల్ల ఎదురయ్యే ముప్పును అధికారులు ఆ నివేదికలో స్పష్టంగా చెప్పారు.

న్యాయశాఖ సహా 20 ప్రభుత్వ శాఖల్లోని 159 మంది అధికారులు, సైనిక, పోలీసు అధికారుల చెప్పిన వివరాలను ఆ నివేదిక క్రోడీకరించింది. వ్యవస్థీకృత నేర ముఠాలు దేశ భద్రత, న్యాయ వ్యవస్థల్లో తమకు కావాల్సిన వారిని నియమించుకునే స్థాయికి చొచ్చుకుపోయాయనేది ఆ అధికారులు ముక్త కంఠంతో చెప్పిన మాట. రాజకీయ సంకల్పం ఉంటే తప్ప వ్యవస్థీకృత నేర ముఠాలకు కళ్లెం వేయడం అసాధ్యం.

Related News

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

America: అమెరికాలోని మిషిగాన్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో 9 మందికి గాయాలు..

Big Stories

×