Trump – Musk : డబ్బు పవర్‌ఫుల్లా? అధికారం పవర్‌ఫుల్లా? అంటే పవరే పవర్‌ఫుల్ అని చెప్పాలేమో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య డైలాగ్ వార్‌లో మిస్టర్ ప్రెసిడెంట్‌దే అప్పర్ హ్యాండ్ అయింది. ట్రంప్ దెబ్బకు మస్క్ బెదిరిపోయాడు. టెస్లాకు రాయితీలు కట్ చేస్తా అనగానే కాళ్ల బేరానికి వచ్చాడు. సారీ చెప్పకపోయినా.. జరిగిన దానికి చింతిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. డబ్బులు ఉన్నాయి కదాని.. కొత్త పార్టీ పెడతా.. ట్రంప్ బూతు బాగోతం బయటపెడతా అంటూ నానారచ్చ చేసిన మస్క్ మెళ్లిగా సైడ్ అవుతున్నారు.
ఎలాన్ మస్క్ లెటెస్ట్‌గా ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాను మస్క్ విషయంలో చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను.. అందులో కొన్ని హద్దులు మీరాయి.. అంటూ రాసుకొచ్చారు. సో.. మస్క్ మళ్లీ ట్రంప్‌తో దోస్తీ చేసేందుకు రెడీగా ఉన్నారని అర్థమవుతోంది.
I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.
— Elon Musk (@elonmusk) June 11, 2025
ఏదైనా ఓవర్ గానే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు నుంచి.. మొన్నటి వరకూ మస్త్ హుషారుగా సాగింది ట్రంప్, మస్క్‌ల దోస్తానా. కానీ గత వారం సీన్ మారిపోయింది. ట్రంప్‌ను మస్క్ ఓపెన్‌గానే విమర్శించారు. ట్రంప్ కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నారు. ఇరువురి బంధానికి బ్రేక్ పడింది. కానీ ఉన్నట్టుండి మస్క్ యూటర్న్ తీసుకున్నారు.
దారికొచ్చిన మస్క్
ట్రంప్‌పై విమర్శల విషయంలో మస్క్ ఎంతదూరం వెళ్లారంటే.. ఏకంగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. జెఫ్రీ ఫైల్స్‌తో ముడిపెడుతూ ఓ వివాదాస్పద పోస్ట్ కూడా చేశారు. కానీ తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ట్రంప్‌తో రాజీకి సిగ్నల్ ఇచ్చారు. లేటెస్ట్‌గా.. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మరోసారి ఫ్రెండ్‌షిప్ కోసం ముందుకొచ్చారు.
ఎవరితో ఎవరికి పని?
నిజానికి మస్క్ అవసరం ట్రంప్‌కు లేదు. కానీ ట్రంప్ అవసరం మాత్రం మస్క్‌కు మస్ట్ అనే చెప్పాలి. అమెరికా ప్రభుత్వంపై ఆధారపడి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్.. ఇలా తన అనేక సంస్థలు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ అవసరం. ఈ విషయాలన్ని గుర్తించే తనకు నచ్చకపోయినా.. మస్క్ మనసు చంపుకొని మరీ రాజీ బాట పట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ కూడా మస్క్‌తో మంచిగా ఉండేందుకే ప్రయత్నిస్తారని అనిపిస్తోంది. మస్క్ ఎఫెక్ట్ అటు ప్రభుత్వం, ఇటు పెట్టుబడులపై కచ్చితంగా ఉంటుంది. అందుకే ట్రంప్ కూడా ఓ మెట్టుదిగే అవకాశం లేకపోలేదు.