Fugitive As Twin Brother| సాధారణంగా కవలలు ఒకేలా కనిపిస్తారు. ఈ పోలిక కారణంగా ఒక నేరస్థుడు పోలీసుల నుంచి తప్పించుకునే మార్గంగా మారింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కిడ్నాప్, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి, చనిపోయిన తన కవల సోదరుడి గుర్తింపుతో దాదాపు 19 ఏళ్లు జీవించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, అతడి సోదరుడి ప్రియురాలు ఈ రహస్యాన్ని బయటపెట్టేసింది.
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న యుహువాన్ నగరంలో 2002లో కిడ్నాప్, దోపిడీ ఘటన జరిగింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, నగదు, విలువైన వస్తువులు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే, చెన్ అనే వ్యక్తి మాత్రం జైలు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు.
2007లో చెన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి కుటుంబ రిజిస్ట్రేషన్ కూడా రద్దయింది. అయితే, తర్వాత చనిపోయింది చెన్ కాదు, అతడి కవల అన్నయ్య అని దర్యాప్తులో బయటపడింది. ఇద్దరూ ఒకేలా కనిపించడంతో చెన్ తన అన్నయ్య గుర్తింపును ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తన అన్న పేరుతో జీవిస్తూ పోలీసులకు చిక్కకుండా ఉన్నట్లు అధికారులు అనుమానించారు.
2026 ఏప్రిల్‌లో చెన్ తన చనిపోయిన సోదరుడి గుర్తింపును వాడుకుంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అధికారి లాంగ్ యువెన్ పాత కేసును మళ్లీ పరిశీలించారు. పాత గుర్తింపు ఫొటోల్లో ముఖ కవళికలు, ఇతర వివరాల్లో తేడాలు కనిపించడంతో అనుమానాలు పెరిగాయి.
చెన్ అన్నయ్య ప్రియురాలు డెంగ్. ఆమెను పోలీసులు సంప్రదించారు. ఆమెకు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఆమెను విచారణ చేయగా.. చనిపోయింది చెన్ అన్నయ్యేనని డెంగ్ పోలీసులకు తెలిపింది. దీంతో దర్యాప్తుకు కీలక సమాచారం లభించింది. ప్రమాదానికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన పోలీసులు, గుర్తింపు మార్పు జరిగి ఉండవచ్చని అనుమానించారు. మరణ నమోదు సమయంలో చెన్ తన డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపయోగించినట్లు కూడా గుర్తించినట్లు సమాచారం.
Also Read: భర్త సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. అయినా భార్యకు భరణం ఇవ్వకూడదని చెప్పిన కోర్టు.. ఎందుకంటే
చివరకు పోలీసులు చెన్‌ను చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఝుహాయ్ నగరంలో గుర్తించారు. 2026 జూన్ 4న అతడిని అరెస్ట్ చేశారు. అప్పటికే అతడు పెళ్లి చేసుకొని భార్య, పిల్లలతో జీవిస్తున్నట్లు సమాచారం.
పోలీసులు అతడి వేలిముద్రలు, ఇతర జీవసంబంధ నమూనాలను సేకరించి, 2002 కేసుకు సంబంధించిన ఆధారాలతో పోల్చారు. ఈ కేసును తదుపరి చర్యల కోసం ప్రాసిక్యూటర్లకు పంపించారు. దోషిగా తేలితే చెన్‌కు మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్థానిక మీడియా నివేదించింది.
Also Read: జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!