Gas Cylinder Exploded in Pakistan : విపరీతమైన ఎండల కారణంగా.. హీట్ పెరిగి గ్యాస్ సిలిండర్ బ్లాస్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 50 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింధ్ లోని హైదరాబాద్ ప్రాంతంలో గల ఒక దుకాణంలో గ్యాస్ సిలిండర్.. అధిక ఉష్ణోగ్రత కారణంగా పేలిపోయింది. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలంతా ప్రయత్నించగా.. మరింత వేగంగా వ్యాపించడంతో బయటకు వెళ్లలేక చిక్కుకున్నారు. వారంతా ప్రమాదం నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో మంటల్లో చిక్కుకుని గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 50 మంది గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
కాగా.. ప్రమాదం జరిగిన షాపు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందని, మొదటి, రెండో అంతస్తులలో అపార్టుమెంట్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలుడుకు విపరీతమైన వేడే కారణమని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటాయి.