Gaza : ప్రపంచంతో గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. బాంబుదాడుల కారణంగా ఇంటర్నెట్ సెల్యులర్, లాండ్ లైన్ సేవలకు సంపూర్ణ విఘాతం ఏర్పడింది. ఇప్పటికే విద్యుత్తు, తాగునీరు, తిండి లేక పాలస్తీనా ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా సమాచార సంబంధాలు కూడా తెగిపోవడంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
అటు దాడుల్లో గాయపడిన వారికి వైద్యసేవలు అందించడమూ కష్టమవుతోంది. దాడులు ఉధృతమైన దరిమిలా పాలస్తీనియన్లు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోలేని దుస్థితి నెలకొంది. కేబుళ్లు, సెల్ టవర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భూతల దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరంభించిన అనంతరం ఇంటర్నెట్ బ్లాకవుట్ అయింది.
గాజాలో కనెక్టివిటీ అన్నదే లేదని ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ నెట్‌బ్లాక్స్ వెల్లడించింది. కమ్యూనికేషన్లను పునరుద్ధరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనపడటం లేదని పాలస్తీనాలో కమ్యూనికేషన్ల ప్రధాన కంపెనీ పాల్‌టెల్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొంది. బాంబు దాడుల వల్ల కొద్దో గొప్పో మిగిలిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ లైన్లు కూడా ధ్వంసమయ్యాయని తెలిపింది.
గాజాలోని తమ ఆపరేషన్ రూంతో సంబంధాలు తెగిపోయాయని మానవతా సాయం అందిస్తున్న రెడ్ క్రిసెంట్ సంస్థ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’లో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిపై ఆ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, గాజాలో హమాస్ లక్ష్యంగా క్షేత్రస్థాయి దాడులను ముమ్మరం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.