గతంలో కూతురు కాన్పుకోసం పుట్టింటికి వస్తే ఆమెతోపాటు తల్లి కూడా పురుడు పోసుకునే సందర్భాలు ఉండేవి. అంటే ఓ పక్క అమ్మమ్మలు అవుతూనే మరోవైపు అమ్మగా మరో బిడ్డకు జన్మనిచ్చేవారు. అలాంటి ఉదాహరణలు ఇప్పుడు దాదాపుగా లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చిన తర్వాత ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటున్నారంతా. అంటే ఆ ఇద్దరి పిల్లలు, వారి చదువులు, పెళ్లిల్లు, మనవళ్లు, మనవరాళ్లతో సమయం సరిపోతుంది. అయితే ఈ రోజుల్లో కూడా 66 ఏళ్ల ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చి అరుదైన రికార్డ్ సాధించింది. ఆమెకు ఆల్రడీ 46ఏళ్ల కూతురుంది. ఆ తర్వాత మరో 8మందికి జన్మనిచ్చింది. తాజాగా ఇప్పుడు 66 ఏళ్ల వయసులో పదో బిడ్డకు జన్మనిచ్చింది.
సిజేరియన్ ద్వారా కాన్పు
ఆమె పేరు అలెగ్జాండ్రా హిల్డె బ్రాండ్. జర్మనీ రాజధాని బెర్లిన్ లోని ఒక పురాతన మ్యూజియంకు ఆమె డైరెక్టర్ గా పనిచేస్తోంది. ఆమె వయసు 66 ఏళ్లు. మార్చి 19న బెర్లిన్ లోని ఒక చారిటీ ఆస్పత్రిలో హిల్డె బ్రాండ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 66 ఏళ్ల వయసులో ఆమెకు గర్భం అంటే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. తీరా ఇప్పుడు సుఖ ప్రసవంతో ఆమె అందర్నీ మరోసారి ఆశ్చర్యపరిచారు. సిజేరియన్ ద్వారా ఆమెకు పురుడు పోశారు వైద్యులు.
సహజ పద్ధతిలోనే గర్భం
66 ఏళ్ల వయసులో పిల్లల్ని కనాలనే ఆలోచన రావడమే కష్టం. అయితే హిల్డె బ్రాండ్ మాత్రం ఆ ఆలోచనను నిజం చేసుకోవాలనుకుంది. అప్పటికే 9మంది పిల్లున్నా కూడా ఆమె 10వ బిడ్డ కోసం ప్రయత్నించింది. దానికోసం ఆమె ఐవీఎఫ్ లాంటి కృత్రిమ పద్దతుల్ని పాటించలేదు. సహజసిద్ధంగానే ఆమె గర్భందాల్చింది. గర్భవతిగా పూర్తి ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
మొదటి కూతురు వయసు 46
హిల్డె బ్రాండ్ తొలి సంతానం హిల్డెబ్రాండ్ స్విట్లానా. ఆమె వయసు 46 ఏళ్లు. ఆ తర్వాత 36 ఏళ్ల ఆర్టియోమ్ ఉంది. 12 ఏళ్ల వయసున్న కవలలు కూడా ఆమెకు ఉన్నారు. చివరిగా పుట్టిన ఫిలిప్ అనే మగబిడ్డతో సహా మొత్తం 10మంది ఆమె సంతానం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోనే తాను ఈ వయసులో కూడా ఇంత హెల్దీగా ఉన్నానని చెబుతారు హిల్డె బ్రాండ్. రోజూ రెండు గంటలు నడకతో కూడిన వ్యాయామం, ఒక గంటసేపు స్విమ్మింగ్.. ఇవే తన ఆరోగ్య రహస్యాలు అంటారామె. శారీరక ఆరోగ్యంతోపాటు, పునరుత్పాదక శక్తి కూడా ఉండటం వల్లే ఆమె 10మంది పిల్లలకు జన్మనిచ్చారని అంటున్నారు వైద్యులు.
66 ఏళ్ల వయసులో తల్లి అయిన హిల్డె బ్రాండ్ గురించి తెలుసుకుని చాలామంది షాకయ్యారు. 70 ఏళ్ల వయసులో కూడా ఓ మహిళ తల్లి అయిందని తెలిస్తే మరింత ఆశ్చర్యపోవడం ఖాయం. అవును, 2023లో ఉగాండాకు చెందిన 70 ఏళ్ల సఫీనా నముక్వాయా తల్లి అయింది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఆమె గర్భందాల్చడం విశేషం. కవలలకు జన్మనిచ్చిన సఫీనా అత్యంత వయసుమళ్లిన తల్లిగా రికార్డు సృష్టించింది. అయితే హిల్డె బ్రాండ్ మాత్రం సహజ పద్ధతుల్లో గర్భందాల్చి సరికొత్త రికార్డ్ సృష్టించింది.