CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని సీఎం ఆకాంక్షించారు.
కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని సీఎం రేవంత్ రెడ్డి అభిలషించారు. ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ప్రస్తుతం కొడంగల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. తర్వాత స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారని సీఎం అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చని.. వాళ్లను పట్టించుకోవద్దని చెప్పారు. తాను ఏం చేస్తానో… ఏం చేయనో కొడంగల్ నియోజకవర్గ ప్రజల కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని అన్నారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా లేవనెత్తింది తానే అని అన్నారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కొడంగల్ లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25 శాతం మంజూరు చేశామని సీఎం తెలిపారు. ఒక్క సంతకంతో కొడంగల్ కు కావాల్సినవి అన్నీ వస్తాయని.. నియోజకవర్గ ప్రజలు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. చిట్టీ రాసిస్తే చాలు తాను కొడంగల్ కు వచ్చి అన్నీ పూర్తి చేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: ISRO Recruitment: ఐటీఐ, బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. ఇంకెందుకు ఆలస్యం
ALSO READ: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?