Greece Wildfires: గ్రీస్ లో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తూ బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి చారిత్రక నగరమైన ఏథెన్స్ ను కార్చిచ్చు సమీపిస్తుండడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వం వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నది. దాదాపు 500 మంది ఫైర్ సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా కూడా అగ్నికీలలు అదుపులోకి రావడంలేదు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు మొత్తం 152 ప్రత్యేక వాహనాలను వాడుతున్నారు. 29 వాటర్ డ్రాపింగ్ విమానాలను కూడా రంగంలోకి దించారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడంలేదు. కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తూనే ఉంది. దీంతో స్థానికంగా మారథాన్ సహా ఇతర ప్రాంతాల వాసులను ముందు జాగ్రత్తలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి సైనిక ఆసుపత్రిని సైతం ఖాళీ చేయించారు.
ఇదిలా ఉంటే.. అగ్ని కీలలను ఆర్పే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. అదేవిధంగా చాలామంది పొగ కారణంగా అస్వస్థతకు గురికావడంతో వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read: అందాల పోటీల్లో విన్నర్ గా దివ్యాంగురాలు.. వివాదాస్పదంగా మిస్ సౌత్ ఆఫ్రికా కాంపిటీషన్!
కాగా, కార్చిచ్చు కారణంగా వ్యాపించిన పొగ ఏథెన్స్ నగరాన్ని పూర్తిగా కమ్మేసింది. ఆదివారం రాత్రి వరకు కార్చిచ్చు ఎథెన్స్ కు దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు కారణంగా గ్రీస్ లోని పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ను ప్రకటించారు.
2018లో వచ్చిన కార్చిచ్చు మాటి నగరాన్ని కాల్చి బూడిద చేసిన విషయం తెలిసిందే. అప్పుడు అత్యంత వేగంగా పాకిన కార్చిచ్చు వల్ల దాదాపు 100 మందికి పైగా ఇళ్లలో, రోడ్లపై ప్రాణాలను కోల్పోయారు. అదేవిధంగా గతేడాది వ్యాపించిన మంటల్లో సుమారుగా 20 మంది మృతిచెందారు.